ఆర్టీ పీసీఆర్ టెస్టు పై అనుమానాలు..వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే

కరోనా పరీక్షల్లో ప్రధానంగా యాంటీజెన్ టెస్ట్‌ లో నెగిటివ్ వస్తే ఎందుకైనా మంచిదని, కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. అయితే ఆర్టీ పీసీఆర్ లో వచ్చిన ఫలితాన్నే ఫైనల్ నిర్ధారణగా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా, కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుజరాత్‌కు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. ఆ రాష్ట్రంలో ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ వచ్చిన వారికి హై రిజల్యూషన్ సిటీ స్కానింగ్‌లో వైరస్ ఆనవాళ్లు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది.

సాదారణంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ వస్తే… కొన్ని రోజుల తరువాత సిటీ స్కాన్ చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నవారు… ఆర్టీ పీసీఆర్‌తో పాటు సిటీ స్కాన్‌ కూడా వెంటనే చేయించుకోవాలని సిఫారసు చేస్తున్నారు. దీనివల్ల సాధ్యమైనంత త్వరగా వైరస్‌ను గుర్తించి రోగులకు చికిత్స అందించవచ్చని అంటున్నారు.

ఆర్టీ పీసీఆర్ టెస్టులో ముక్కు నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తారు. స్వాబ్ ప్రాంతంలో వైరస్ ఉండట్లేదు కాబట్టి… ఆ టెస్టులో వైరస్ లేనట్లుగా చూపిస్తోందని వివరిస్తున్నారు. అలా కాకుండా బీఏఎల్ విధానంలో… ఊపిరితిత్తుల నుంచి లిక్విడ్ సేకరిస్తారు… అక్కడ వైరస్ ఉంటోంది కాబట్టి… ఆ విధానంలో వైరస్ ఉన్న విషయం బయటపడుతోందంటున్నారు. ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగెటివ్ వచ్చి… కరోనా లక్షణాలు ఉంటే…వెంటనే సీటీ-స్కాన్ చేయించుకోవడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఆర్టీ పీసీఆర్ టెస్టు కచ్చితత్వం 70 శాతం మాత్రమే. అంటే ఇవి ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశం 30 శాతం వరకు ఉంది. కొన్నిసార్లు నమూనాల సేకరణ సరిగా చేయకపోవడం, టెస్టింగ్‌ వైఫల్యాల వల్ల కూడా ఇలా జరగవచ్చంటున్నారు. అందువల్ల లక్షణాలు ఉండి కూడా ఈ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారు …వైరస్ నిర్ధారణ కోసం వెంటనే సిటీ స్కాన్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.