అందరికంటే మీకే ఎక్కువగా చలి పెడుతుందా..? అయితే ఈ లోపాలు ఉన్నట్లే..

-

చలికాలంలో చలిగా అనిపించటం సహజం.. కానీ కొంతమందికి ఇంట్లో ఉన్నవాళ్లకంటే ఎక్కువ చలివేస్తుంది. అది ఏ సీజన్‌ అయినా వాళ్లు ఎప్పుడూ చలిగానే ఫీల్‌ అవుతారు. ఇక చలికాలం అలా వచ్చిందంటే చాలు.. అసలు ఫ్యాన్స్‌ వేసుకోవడానికి ఇష్టపడరు. నిజానికి అంత చల్లగా లేకున్నా వాళ్లు మాత్రం బాగా చలిగా ఉందంటారు.. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్లు ఉండే ఉంటారు కదా.. కానీ ఇలా అందరికంటే ఎక్కువగా చలిపెడుతుందంటే.. వారి ఆరోగ్యం బాలేదని అర్థం.. కొన్ని లోపాల వల్లే ఇలా జరుగుతుంది. మరి ఆ లోపాలు ఏంటో చూద్దామా..

హైపోథైరాయిడిజం- Hypothyroidism
థైరాయిడ్ గ్రంథి పని చేయని స్థితిని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలు, ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మీ శరీరంలో తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాలేకపోతే చలిని అనుభూతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలసట, మలబద్ధకం, బరువు పెరగడం ఈ వ్యాధి లక్షణాలు.

విటమిన్ B12 లోపం
బాగా చలిగా అనిపించడం, అలసట, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఆకలి లేకపోవడం వంటివి విటమిన్ B12 లోపం వల్ల వచ్చే లక్షణాలు.. శరీరంలో విటమిన్ బి12 స్థాయిలు తగ్గినపుడు మీకు చలికాలంలో ఎక్కువగా చలి పెడుతుంది. దీనిని నివారించేందుకు పాలు, గుడ్లు, పనీర్, చికెన్ వంటి వేడి గుణాలు కలిగిన ఆహారాలను తీసుకుంటే సరి.!

మధుమేహం- Diabetes
డయాబెటీస్ మూత్రపిండాలపై మాత్రమే కాకుండా, శరీరంలో రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుందని చాలా మందికి తెలియదు…డయాబెటిక్ రోగులకు శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు దగ్గు, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతారు.. అయితే వీరు నడక, వ్యాయామాలు చేయడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది.

నరాల బలహీనత- Nerve Weakness
నరాలు దెబ్బతిన్నప్పుడు, నరాల బలహీనపడినపుడు చలి లక్షణాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. నరాల సంబంధిత సమస్యలు కలవారు శీతాకాలంలో చాలా వణుకుతారు. అలాగే అలసట, కళ్లు తిరగడం, కళ్లు మండటం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

రక్తహీనత- Anemia
రక్తహీనత ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణం చలి. ఇనుము లోపం కారణంగా ఎర్ర రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీనివల్ల.. శరీరానికి చలి ఎక్కువ పెడుతుంది. ఎర్ర రక్త కణాలు మీ శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళతాయి. మీరు రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్‌ను ఉండదు..ఇది మీ జీవక్రియ మందగించడానికి కారణమవుతుంది. ఇది చలిని కలిగిస్తుంది, చలికాలంలో తీవ్రత ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా రక్తహీనతకు గురవుతారు.

బలహీనమైన జీవక్రియ- Poor Metabolism
అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల, వృద్ధాప్యం కారణంగా శరీర జీవక్రియలు నెమ్మదిగా సాగుతాయి. దీంతో శరీరానికి వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా పడిపోతుంది. ఇలాంటి వారు చలికి బాగా వణికి పోతారు.

చలికి సున్నితత్వం ఉన్నవారు శరీరాన్ని వెచ్చగా ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా చలికి తట్టుకోలేకపోతే వైద్యులను సంప్రదించండి..అంతే కానీ లోపం ఏంటో తెలుసుకోకుండా లైట్‌ తీసుకోకండి.!

Read more RELATED
Recommended to you

Latest news