రోజుకొక ఉసిరికాయ తినండి – ఎలా తిన్నా పరవాలేదు..

-

పుష్కలమైన విటమిన్‌-సి, బ్రహ్మాండమైన రోగనిరోధక శక్తి, ఎల్లప్పుడూ ఉత్సాహం, సకల రోగాల పాలిటి శత్రువు ఉసిరికాయ.  ఈ సీజన్‌లో బాగా దొరికే ఉసిరిని రోజూ ఒకటి తినండి. జీవితమంతా ఆరోగ్యంగా ఉండండి.

ఉసిరికాయ – పురాణకాలం నుండీ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ‘ఆమలక ఫలం’ అంటారు.  సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన ‘త్రిఫల చూర్ణం’లో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. ‘చ్యవన్‌ప్రాశ్‌’లో కూడా ఉసిరి అతిముఖ్యమైన దినుసు.అంతేకాదు, తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా విలసిల్లింది. బ్రిటిష్‌ వారు దీన్ని ‘ఇండియన్ గూస్‌బెర్రీ’గా పిలిచేవారు.

ఈ చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్‌-సి కి బ్యాంక్‌ లాంటిది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కెలోరీలు కూడా చాలా తక్కువ.ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు కూడా రోజూ ఒక ఉసిరికాయ తినమని ఒత్తిడి తెస్తున్నారంటే ఇది ఎంత ఆరోగ్యకరమో ఊహించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, కడుపులో డాక్టర్‌ను పెట్టుకున్నట్టే.

చర్మరక్షణ, కేశ సంరక్షణ, రోగనిరోధక వ్యవస్థలను పకడ్బందీగా నిర్వహిస్తుంది ఈ ఉసిరి. రోజొక ఉసిరికాయను తింటే, జలుబు, దగ్గు, ఫ్లూ లాంటివి మీ దరిచేరవని అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డా. రుజితా దివేకర్‌.‘‘తినండి రోజొక ఉసిరి – ఇంటినిండా ఆరోగ్య సిరి’’ అనేది ఆమె నినాదం.

 కొన్ని ప్రయోజనాలు ఈ క్రింద మీ కోసం..

  • ఉసిరికి ఉన్న ఔషధ గుణాల వల్ల, ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ముఖ్యంగా శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి వాటి బారిన పడకుండా ప్రజలు దీన్ని విరివిగా తినేవారు. ఫ్లూజ్వరం వంటివి వస్తే త్వరగా కోలుకోవడానికి కూడా ఉసిరి సహాయపడుతుంది.
  • మీరు బరువు తగ్గాలని కోరుకుంటే, ఉసిరి తోడుంటుంది. నడుం దగ్గరి కొవ్వును కరిగించి, సన్నని, నాజూకైన నడుమును మీకు బహుమతిగా ఇస్తుంది. వ్యాయామం అంటే మీకు సహజంగా ఉండే బద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
  • డయాబెటిస్‌ ఉన్నవారికి ఇది అమృతం లాంటిది. ఇన్సులిన్‌ స్పందనను పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించగలుగుతుంది.

  • గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఉసిరిని తమ ఆహారంలోకి చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఇది కొలెస్టరాల్‌ ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు, హృదయ రక్షణ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
  • ఇకవిటమిన్‌-సి విషయానికొస్తే, ఉసిరికాయ, నారింజపండు కంటే ఇరవై రెట్లు ఎక్కువ సి-విటమిన్‌ను కలిగిఉంటుంది. అలసట, నీరసం, చిరాకులను పారద్రోలడానికి సులభమైన మార్గం ఉసిరికాయ.
  • ఉసిరికాయలోని రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు, గాయాలను త్వరగా నయం చేయడంలో బాగా ఉపయోగపడతాయి.

  • మీరు శరీరంలో ఇనుము లేకపోవడం, రక్తహీనతలతో బాధపడుతుంటే, ఉసిరికాయ కంటే ఉత్తమమైనదేదీ లేదు. శరీరంలో ఐరన్‌ను ప్రోది చేయడానికి, హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
  • ఉసిరిలోని ఈ ఇనుము సమీకరణ గుణం, అమ్మాయిలకు బాగా ఉపయోగపడుతుంది. వారికి రుతుక్రమానికి ముందు వచ్చే నొప్పిని అరికడుతుంది. క్రమం తప్పకుండా తింటే, రుతుస్రావపు నొప్పినుండి కూడా బయటపడొచ్చు. ఇంకా, రెండోరోజు కూడా స్రావం ఎక్కువగా ఉంటే, ఉసిరిలోని విటమిన్‌ బి1, బి2లు మీకు సహాయకారిగా ఉంటాయి.
  • మీకు యవ్వనవంతమైన చర్మం, గ్రే కలర్‌ లేని కేశాలు కావాలంటే, ఉసిరిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
  • కళ్లు, పళ్ల సంరక్షణలో కూడా ఉసిరికాయ చాలా మేలు చేస్తుంది.

ఉసిరికాయను ఆహారంగా తీసుకునే మార్గాలు

ఉసిరికాయ బహుముఖ ప్రయోజనాలు కలిగిన పండు. దీన్ని తినాలంటే రకరకాల పద్ధతులున్నాయి.

  • నేరుగా తినేయొచ్చు. కావాలంటే కొద్దిగా ఉప్పు చల్లుకోండి.
  • మెత్తగా దంచి, నీళ్లలో కలుపుకుని షర్బత్‌లాగా తాగేయవచ్చు.

  • ఉసిరి మురబ్బా, ఉసిరి జామ్‌ కూడా తయారుచేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎక్కువకాలం కూడా నిల్వ ఉంటాయి.
  • ఉసిరికాయ పచ్చడి. దీనికెలాగూ తెలుగువారు అభిమానులే. ఇక చెప్పనవసరం లేదు.
  • ఉసిరికాయ ముక్కలను ఉప్పులో నానబెట్టి, తర్వాత ఎండబెట్టి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే మంచి శక్తితో పాటు మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది. అన్నట్లు అజీర్తిని వెంటనే అరికడుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news