నువ్వెంతా.. కూరలో కరివేపాకు లాంటోడివి.. తీసి పక్కన పెట్తేస్తాం లాంటి డైలాగులు వినే ఉంటారు. పక్కన పెట్టేస్తారు కాబట్టి కరివేపాకు కి విలువ లేనిదిగా చెప్పుకుంటారు. కానీ కరివేపాకు వలన కలిగే లాభాలు ఏంటో తెలిస్తే ఇలాంటి మాటలు మళ్లీ మాట్లాడరు. లొట్టలేసుకుని మరీ కరివేపాకు తినడానికి రెడీ అయిపోతారు. ఆరోగ్యానికి కరివేపాకు చేసే లాభం అంతా ఇంతా కాదు. కరివేపాకు తీసుకోవడం వల్ల శరీరంలో ఏ, బీ, సీ, బీ2 విటమిన్లు వృద్ధి చెందుతాయి.
బరువు తగ్గిస్తుంది..
కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ కొవ్వును కరిగించడంలో సాయపడి బరువు తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గడానికి వ్యాయామం, స్పెషల్ డైట్ తో పాటు కరివేపాకు ని జోడించండి.
నోటి దుర్వాసన పోగొడుతుంది..
నోటి దుర్వాసనని పోగొట్టుకోవడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఉదయం ఐదు కరివేపాకుల్ని తీసుకుని ఐదు నిమిషాల పాటు నమలండి. ఆ తర్వాత పుక్కిలించి ఉమ్మితే నోటి దుర్వాసన దూరమవుతుంది.
మలబద్దకం..
ఎండిన కరివేపాకులని తీసుకుని గ్రైండ్ చేసి బట్టర్ మిల్క్ లో కలుపుకుని పొద్దున్న ఖాలీ కడుపుతో తాగడం వలన విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
షుగర్ నియంత్రణ..
కరివేపాకులతో చట్నీ చేసుకుని ఆహారంతో పాటుగా తీసుకోండి. దీణి ద్వారా శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి.
నోటి పుళ్ల నుండి ఉపశమనం..
కరివేపాకు పొడిని తీసుకుని తేనెతో కలుపుకుని పుండు మీద పూయండి. రెండు మూడు రోజులు ఇలాగే చేస్తుంటే నోట్లో పుళ్ళు తగ్గిపోతాయి.
ఇవే కాదు ఇంకా కరివేపాకు వల్ల చాలా లాభాలున్నాయి. కళ్లకి కావాల్సిన ఏ విటమిన్ ని వృద్ధి చేయడంలో, ఒత్తిడి తగ్గించడంలో , తల వెంట్రుకలు పెరిగేందుకు కరివేపాకు చాలా సాయపడుతుంది.