నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే..?

-

చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో దీన్ని ఎదుర్కొన్నవారే. మనం తినే ఆహార పదార్థాలు, అలవాట్లు, జబ్బుల వంటివేవి నోటి దుర్వాసనకు దారితీయొచ్చు. ఇది వాసనకు సంబంధించిన సమస్యే అయినా సామాజిక జీవితం మీదా ప్రభావం చూపుతుంది. మన రోజువారీ వ్యవహారాలన్నీ మాటలతో సాగేవే. నోటి దుర్వాసన వస్తుంటే ఇతరులతో సన్నిహితంగా మెలగటం ఎలా సాధ్యం?

 

నోటి దుర్వాసనకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చు. దీనికి మూలం చాలావరకూ నోరే. ముక్కు, ముక్కు చుట్టుపక్కలుండే గాలిగదులు, గొంతు, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయంలో తలెత్తే సమస్యలూ దుర్వాసనకు దారితీయొచ్చు. అరుదుగా కాలేయ వైఫల్యం, కీటోఅసిడోసిస్‌ వంటివీ కారణం కావొచ్చు. మన నోట్లో 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. శ్వాసను వదులుతున్నప్పుడు తేమ 96 శాతానికీ చేరుకుంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందటానికిది అనువుగా వాతావరణాన్ని కల్పిస్తుంది.

నోట్లో 500కు పైగా బ్యాక్టీరియా రకాలు ఉంటాయని అంచనా. వీటిల్లో చాలావరకు వాసనలను పుట్టించేవే. ఇలాంటి పరిస్థితుల్లో నోటిని సరిగా శుభ్రం చేసుకోనట్టయితే వాసనను పుట్టించే బ్యాక్టీరియా తామరతంపరగా వృద్ధి చెందుతుంది. మనం తిన్న ఆహార పదార్థాల ముక్కలు పళ్ల మధ్య, నాలుక, చిగుళ్ల మీద చిక్కుకున్నప్పుడు బ్యాక్టీరియా పోగుపడి, అది క్రమంగా పొరలా ఏర్పడుతుంది. ఈ బ్యాక్టీరియా లాలాజలంలోని గ్లూకోజు, పెప్టైడ్లు, ప్రొటీన్ల వంటి కర్బన పదార్థాలను క్షీణింపజేసే క్రమంలో వాసన పుట్టించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి శ్వాసలో కలిసి దుర్వాసన కలిగిస్తాయి.

నోటి దుర్వాసన రాకుండా ఏం చేయాలి..?

  • నోటి దుర్వాసనకు కారణాన్ని గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. చాలావరకు దీని మూలం నోట్లోనే ఉంటుంది. కాబట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవటం ప్రధానం. దీంతో బ్యాక్టీరియా వృద్ధి కాకుండా, పేరుకుపోకుండా చూసుకోవచ్చు.
  • రోజూ ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకోబోయే ముందు బ్రష్‌తో పళ్లను తోముకోవాలి. ప్రతి 2-3 నెలలకోసారి బ్రష్‌ను మార్చాలి.
  • బాక్టీరియా, ఆహారం, మృత కణాలు నాలుక మీద పేరుకొని పూతలా ఏర్పడతాయి. పొగ తాగేవారిలో, నోరు ఎండిపోయేవారిలో ఇదెక్కువ. పలుచటి బద్దతో నాలుక మీద గీకి, పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
  • ద్రవాలు తగినంత తాగాలి. మద్యం, పొగాకు నోరు ఎండిపోయేలా చేస్తాయి కాబట్టి వీటిని మానెయ్యాలి. చక్కెరలేని చూయింగ్‌ గమ్‌ నమిలితే మంచిది. ఇది లాలాజలం ఊరేలా చేస్తుంది. ఒకవేళ దీర్ఘకాలంగా నోరు ఎండిపోతుంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేసే మందులు ఉపయోగపడతాయి.
  • ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, ఘాటు వాసనలతో కూడిన మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. తీపి పదార్థాలూ దుర్వాసనకు దారితీయొచ్చు. కాబట్టి వీటిని మానేస్తే మంచిది. ఒకవేళ మిఠాయిల వంటివి తింటే వెంటనే నీటితో పుక్కిలించి నోటిని శుభ్రం చేసుకోవాలి. అల్పాహారంగా పచ్చి కూరగాయలు, పండ్ల ముక్కలను నమిలి తినటం మంచిది. ఇవి లాలాజలం ఊరేలా చేస్తాయి. నాలుక వెనక భాగంలో పేరుకున్న పాచిని తొలగిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news