కొంతమందికి అటుఇటు ఎంత మసిమిలాడినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చదువండి.
– సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది.
– సరైన ఆహారం లేకుంటే ఆరోగ్యం కొన్ని రోజులైనా బాగుంటుంది. నిద్ర మాత్రం సరిపడా లేకుంటే మాత్రం రెండురోజులకే బకెట్ తన్నే అవకాశాలున్నాయి సుమా. ఇంత క్రేజ్ ఉంది నిద్రకు. ఇది ఎంత మంచిదో అంత చెడ్డది కూడా.
– నిద్ర సామర్థ్యాన్ని నేర్చుకునే తత్వాన్ని, జాపక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనితోనే కొత్త ఉత్సాహం పొందుతుంది. రోజుకు 8 గంటలపాటు నిద్రపోకుంటే అనారోగ్యం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– రాత్రి హాయిగా నిద్రపోతే రోజంతా హాయిగా, ఉత్సాహంగా ఉంటారు. అదే నిద్ర సరిగా లేకుంటే అందరిని విసుక్కుంటూ ఇతరులపై అరుస్తూ గొడవలకు దిగే అవకాశం ఉంది. రాత్రుల నిద్రపోకుండా మేల్కుంటే.. ఒబిసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, డయాబెటిస్, నిద్రలేమి సమస్యల బారిన పడక తప్పదు.
– కొంతమంది మాత్రం బెడ్ మీద వాలగానే గాఢ నిద్రలోకి జారిపోతారు. మరికొంతమందికి అరగంట తర్వాత నిద్రపడుతుంది. వెంటనే నిద్రపోయే వారికన్నా కాస్త సమయం తీసుకొని నిద్రపట్టేవారే బెటర్ అంటున్నారు నిపుణులు.
– అందుకు అని అంటే పడుకోగానే వెంటనే నిద్ర పడితే వారికి నిద్ర సరిపోకపోవడమే కారణమట. అదే నిద్ర సరిపోతే మరలా నిద్రలోకి జారుకోవడానికి కాస్త టైం పడుతుంది. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు.
– వెంటనే నిద్రలోకి జారుకునేవారు ఇంకాస్త టైం నిద్రకు కేటాయించాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. రోజూ సరిగా నిద్రపోతున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ని పనులు ఉన్నా నిద్రకు మాత్రం 8 గంటలు కేటాయించండి. అప్పుడే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.