మనం రోజూవారీ వంటలో వాడే మసాలాలతో మన గుండెకు మేలు చేసే గుణం ఉంటాయట. అదేంటి మసాలాలు వాడితే గ్యాస్ట్రిక్, దాని వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి కదా? అని ఆశ్చర్యపడుతున్నారా? కానీ, కొన్ని మసాలా దినుసులతో మన గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం మసాలాలను వంట రుచిని పెంచటానికి వాడతాం. అయితే ఇవి మన ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల నుంచి కాపాడే శక్తి వీటిలో కొన్నింటికి ఉంది. అంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా. అతిగా మసాలా దినుసులు వాడితే మొదటికే ప్రమాదం అన్నది మరవద్దు. మరి గుండెకు మేలు చేసే 7 మసాలా దినుసులు ఏంటో
తెలుసుకుందాం.
వాము
మనదేశంలో వామును విరివిగా వాడతారు. వంటల్లో ,హెర్బల్ టీలో కూడా వామును చేర్చుకోవచ్చు. హై బ్లడ్ ప్రెజర్ తగ్గించటంతో పాటు జీర్ణకోశ సమస్యలకు వాము మంచి విరుగుడు. గ్యాస్ట్రిసైటిస్‌కు వాము బాగా పనిచేస్తుంది.
అల్లం
అల్లంతో రోగాలను తగ్గిస్తుంది. జ్వరం తీవ్రను తగ్గించేందుకు, పలు శారీరక బాధలకు విరుగుడుగా పనిచేసే అల్లంలో మంచి యాంటీబ్యాక్టీరియల్ గుణాలున్నాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న అల్లం వేసి మీరు కూరలు, టీ వంటివి చేసుకోవచ్చు. అంతేకాదు మన ఒంట్లో ఉన్న కొవ్వు నిల్వలను కరిగించేలా అల్లం పనిచేస్తుంది.
మిరపకాయలు
కారం అంటే ఇష్టపడే వారికి మిరపకాయలు అంటే చాలా ఇష్టం. కానీ మీకు తెలుసా మిరపలో కూడా మంచి ఔషధాలున్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేసే మిర్చితో బీపీని అదుపులో ఉంచవచ్చు. అలాగే విటమిన్ సీ పుష్కలంగా ఉన్న మిర్చితో గుండె జబ్బులు రాకుండా కాపాడుకునే అవకాశాలున్నాయి.
దాల్చిన చెక్క
అస్సలు ఇది లేకుండా ఏ నాన్‌వెజ్ రెసిపీ చేయలేం. బిర్యానీలో కూడా దీనిది ప్రత్యేక పాత్ర
సిన్నమోన్ వాటర్ అంటే దాల్చిన చెక్క వేసి మరిగించిన నీటి వాడకం బాగా పెరిగింది. యాంటీఆక్సిడెంట్లు గుణాలున్న దాల్చిన చెక్కను తింటే కొన్ని వ్యాధులు ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
యాలకులు
తీయని పదార్థాలతో పాటు మసాలా వంటకాల్లో సైతం దీన్ని వాడతాం. ఎక్కువగా టీలో యాలకులు వాడటం మనం నిత్యం చూస్తుంటాం. విటమిన్ ఏ, ఈ, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్న యాలకులు రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి వేసి చేసే పదార్థాలకు వచ్చే అరోమా మారే దానికి రాదు. ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని ఎక్కువ శాతం వాడతారు. ఇందులో యాంటీ–మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్‌లు కొవ్వును శరీరం నుంచి బయటికి పంపుతుంది. అంతేకాదు డయాబెటిస్‌ని అదుపులో ఉంచుతుంది.
ఆవాలు
ఆవాలు దక్షిణాది వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఆవాలు లేకుండా పోపు వేయలేం.
ఆవనూనె తింటే గుండెకు చాలా మంచిది. బ్లడ్ ఫ్యాట్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచే శక్తి ఆవాలకు ఉంది.