ఎత్తుకు తగిన బరువు కాకుండా అంతకంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా సమస్యే.. ముఖ్యంగా లావుగా ఉండటం వల్ల మన శరీరం అనేక రోగాలకు టోల్‌గెట్‌లా మారిపోతుంది. అన్నీ వచ్చేస్తాయి. అబ్బాయిలు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు లావుగా అయితే.. వారికి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.!
వయసులో ఉన్నాం, ఏం తిన్నా అరిగించుకుంటామనే ధోరణిలో చాలా మంది యువకుల్లో ఉంటుంది. నచ్చిన ప్రతిదీ తినేస్తుంటారు. ఫలితంగా బరువు పెరిగి పోతారు. అయితే, 30 సంవత్సరాల లోపు వయస్సులో బరువు పెరగడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని కొత్త పరిశోధన చెబుతోంది.
17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసులో సంవత్సరానికి ఒక్క కేజి బరువు పెరిగినా సరే వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ 27 శాతం వరకు పెరుగుతుందని స్విడిష్ శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుగొన్నారు. యుక్త వయసులో బరువు అదుపులో పెట్టుకోకపోతే ఆ ఒక్క కారణం భవిష్యత్తులో ప్రాణాంతక వ్యాదులకు కారణం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, జెనెటిక్ మార్కర్స్ మాత్రమే మార్చేందుకు వీలు లేని విషయాలు. కానీ చాలా వరకు క్యాన్సర్ నివారించగలిగే అవకాశం ఉంటుంది. యువకుల్లో బరువు నియంత్రణలో పెట్టుకోవడం ద్వారా చాలా వరకు ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఏటా 12 వేల కంటే ఎక్కువ మంది ప్రొస్టేట్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు.
స్థూలకాయంపై చేసిన అధ్యయనంలో 17 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న 2 లక్షల 58,477 మంది పురుషుల బరువును కనీసం 3 సార్లు ట్రాక్ చేశారు.. 1963 నుంచి 2014 వరకు వారంతా కూడా క్యాన్సర్ బారిన పడలేదు. వారిలో మార్పులను తెలుసుకునేందుకు 2019లో తిరిగి ఫాలోఅప్ చేశారు. అయితే వారిలో 23 వేల 348 మంది ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వారిలో 4790 మంది మరణానికి చేరువలో ఉన్నారు.
30 సంవత్సరాల లోపు బరువు పెరగడం క్యాన్సర్ బారిన పడి దాని వల్ల మరణించేందకు కారణం అవుతోందని ఈ అధ్యయనం చెబుతోంది. స్థూలకాయుల్లో గ్రోత్ ఫ్యాక్టర్ -1 అనే హార్మోన్ క్యాన్సర్ పెరిగేందుకు కారణం అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి మరణాలను నివారించేందుకు ఈ రకమైన పరిశోధనలు కీలకం. ప్రస్తుతం యువకుల్లో చాలా మంది ఆహారపు అలవాట్లు అంత ఆరోగ్యకరంగా లేవు. ఇవి బరువు పెరగడం వల్ల వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ మాత్రమే కాదు నేరుగా చాలా రకాల జీర్ణసంబంధ క్యాన్సర్లకు కారణం అవుతాయి. కాబట్టి కాలేజీలకు వెళ్లే వాళ్లు.. కాలేజ్ అవగానే.. అడ్డమైన గడ్డి అంతా తిని అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటున్నారు నిపుణులు.