ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రస్తుతం కాలుష్యం ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం వల్ల అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఢిల్లీలో ఏటా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో కొన్నేళ్ల తరువాత అక్కడ అసలు నివాసానికి అనుకూలమైన వాతావరణం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కాలుష్యం వల్ల కేవలం ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు 1996 నుంచి 2016 వరకు సుమారుగా 10,997 మందిని పరిశీలించారు. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వారు తిరిగే వాతావరణం, నివసించే ప్రాంతాలు, అక్కడ ఉండే కాలుష్యం, వారికి ఉన్న అనారోగ్య సమస్యలు.. తదితర అనేక వివరాలను తెలుసుకుని అనంతరం వాటిని అధ్యయనం చేశారు. చివరకు తెలిసిందేమిటంటే… కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉండే వారు తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతారట. ముఖ్యంగా భారత్‌తోపాటు చైనాలో ఈ సమస్యలతో బాధపడేవారి సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
కాగా సదరు సైంటిస్టులు చేపట్టిన అధ్యయన వివరాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అనే క్లినికల్ జర్నల్‌లోనూ ప్రచురించారు. ఇక భారత్, చైనాల తరువాత అమెరికాపై ఆ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు చేపడితే కిడ్నీ వ్యాధులు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవచ్చని సైంటిస్టులు సలహా ఇస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఈ విషయంలో ఏం చేస్తాయో చూడాలి..!