నిత్యం మనం సూర్యరశ్మిలో నిలబడితే ఆ కాంతి ద్వారా మన శరీరం విటమిన్ డి ని తయారు చేసుకుంటుందన్న సంగతి తెలిసిందే. విటమిన్ డి మనకు పలు ఆహారాల్లోనూ లభిస్తుంది. అయితే గర్భంతో ఉన్న మహిళల్లో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటే వారికి పుట్టబోయే పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని, వారు తెలివిమంతులు అవుతారని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా వారు 4 నుంచి 6 సంవత్సరాల మధ్య అత్యంత ఎక్కువ ఐక్యూను కలిగి ఉంటారని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో సైంటిస్టులు తమ పరిశోధనల తాలూకు వివరాలను ప్రచురించారు.
సదరు పరిశోధనలకు నాయకత్వం వహించిన మెలిస్సా మెలో అనే సైంటిస్టు మాట్లాడుతూ.. నలుపు రంగులో ఉండే మహిళలకు విటమిన్ డి సరిగ్గా లభించదని, ఎందుకంటే నలుపు రంగులో ఉండేవారిలో మెలనిన్ ఎక్కువగా ఉంటుందని, ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందని, కానీ దాని వల్ల విటమిన్ డి సరిగ్గా తయారు కాదని అన్నారు. అందువల్ల నలుపు రంగులో ఉండే మహిళల్లో సహజంగానే విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటాయన్నారు. అయితే వారే కాకుండా ప్రస్తుతం అనేక మందిలో విటమిన్ డి లోపం సమస్య వస్తుందన్నారు.
గర్భంతో ఉన్న మహిళలు తప్పనిసరిగా విటమిన్ డి పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచన మేరకు కచ్చితంగా విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడాలని మెలిస్సా అన్నారు. పాలు, గుడ్లు, తృణ ధాన్యాలు వంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ డి లభిస్తుందన్నారు. విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉంటారని, వారికి తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
ఇక నిత్యం ఒక వ్యక్తికి 600 ఐయూ వరకు విటమిన్ డి అవసరం అవుతుంది. అదే గర్భంతో ఉన్న మహిళలు అయితే నిత్యం వారికి 4000 ఐయూ విటమిన్ డి అవసరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సూచన మేరకు విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుకోవాల్సి ఉంటుందని అన్నారు.