అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు నిజానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాలి. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. అయితే అధిక బరువును తగ్గించుకునే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొవ్వులు అనారోగ్యకరం…
చాలా మంది కొవ్వు ఆహారాలను తినడం మానేస్తుంటారు. కొవ్వులు అనారోగ్యకరమని నమ్ముతారు. కానీ నిజానికి మనకు నిత్యం కొంత మోతాదులో కొవ్వులు కూడా కావాలి. కొవ్వు పదార్థాలను కొద్ది మొత్తంలో తీసుకుంటే శరీరం మనం తినే ఆహారాల నుంచి తనకు కావల్సిన విటమిన్లు, ఇతర పోషకాలను శోషించుకుంటుంది. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అనబడే పోషకాలు గుండెకు, మెదడు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కనుక కొవ్వులు మనకు ఆరోగ్యకరమే. కాకపోతే వాటిని నిత్యం మితంగా తీసుకోవాలి.
కొవ్వు డైట్‌తో బరువు తగ్గవచ్చు…
ఇది కొంత వరకు నిజమే. కానీ కొవ్వు పదార్థాలను మాత్రమే తినడం వల్ల అందరూ బరువు తగ్గరు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ విధమైన డైట్ పనిచేస్తుంది. ఇక ఈ పదార్థాలను మాత్రమే తింటూ బరువు తగ్గినా.. తరువాత సాధారణ డైట్‌ను పాటిస్తే మళ్లీ బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆ తరహా డైట్‌కు బదులుగా ఆరోగ్యవంతమైన డైట్‌ను పాటించడం ఉత్తమం.
అదనపు కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు మంచివి కావు…
శరీరానికి అవసరం అయిన దానికన్నా తక్కువ కార్బొహైడ్రేట్లతోపాటు తక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాలను కొందరు తింటారు. శరీరానికి నిత్యం కావల్సిన క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోరు. కొంచెం తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకుంటారు. దీంతో శరీరానిక తక్కువ శక్తి లభిస్తుంది. బరువు తగ్గుతారు. నిజమే.. కానీ దీని వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించక దీర్ఘకాలంలో పోషకాహార లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ తరహా డైట్ కూడా పనికిరాదు.
చెమట పడితే బరువు తగ్గినట్లు…
శరీరానికి అధికంగా చెమట పడితే బరువు తగ్గుతున్నామని కొందరు అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. శరీరంలో ఉన్న నీరు బయటకు పోతుంది. అంతే.. ఆ తరువాత మళ్లీ దాహం వేస్తుంది. దీంతో మళ్లీ నీటిని అధికంగా తాగుతాం. శరీరంలోని ద్రవాలు సమతుల్యం అవుతాయి. అంతమాత్రం చేత చెమట పడితే అధిక బరువు తగ్గినట్లు కాదు.
ట్యాబ్లెట్లతో సన్నబడొచ్చు…
ఇది కూడా నిజం కాదు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక వెయిట్ రెడ్యూసింగ్ ట్యాబ్లెట్లను అమ్ముతున్నారు. అవన్నీ సరిగ్గా పనిచేయవు. శాస్త్రీయంగా నిరూపితం అయి, ఎలాంటి దుష్పరిణామాలు లేవని తేలిస్తేనే.. అది కూడా డాక్టర్ సూచన మేరకే బరువు తగ్గే ట్యాబ్లెట్లను వాడాల్సి ఉంటుంది.