ఎంత డబ్బు సంపాదించినా, ఆస్తులు కూడబెట్టినా.. వాటన్నింటినీ మనం బతికి ఉన్నప్పుడే ఉపయోగించుకోగలం. చనిపోయాక అవి మన వెంట రావు. అయితే మనం చనిపోయినా కూడా మన ఆస్తులను పరిరక్షించేవారు ఎవరూ లేకపోతే అప్పుడు అంత డబ్బు, సంపద ఉండి కూడా వృథాయే. కానీ ఆ మహిళ చాలా తెలివైన ఉపాయం చేసింది. తాను చనిపోయినా తన ఆస్తి తాము ఉంటున్న కమ్యూనిటీ వాసులకు దక్కేలా విల్లు రాసింది. అయితే ఈ విషయం ఆమె చనిపోయాక ఇన్నాళ్లకు ఆ కమ్యూనిటీ వాసులకు తెలిసి వారు షాకవుతున్నారు.
జర్మనీలోని వాల్డ్సోల్మ్స్ జిల్లా వెయిపర్ ఫెల్డెన్ కు చెందిన రెనేట్ వెడెల్, ఆల్ఫ్రెడ్ వెడెల్లు దంపతులు. అక్కడ వారు 1975 నుంచి నివాసం ఉంటున్నారు. వారు ఆస్తులు, ధనం బాగానే సంపాదించారు. అయితే 2014లో ఆల్ఫ్రెడ్ చనిపోయాడు. తరువాత 2019లో రెనేట్ కూడా చనిపోయింది. కానీ ఆమె చనిపోయే ముందు తమ ఆస్తిని తమ కమ్యూనిటీ వాసులకు రాసిచ్చింది. కానీ విషయం ఇప్పుడే కమ్యూనిటీ వాసులకు తెలిసింది. దీంతో వారు షాకయ్యారు. ఆమె మొత్తం ఆస్తి విలువ 7.5 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.55 కోట్లు) ఉంటుందని వెల్లడైంది.
అయితే అంతటి ఆస్తి వచ్చినా ఆ కమ్యూనిటీ వాసులు మాత్రం దాన్ని పంచుకోలేదు. ఆ మొత్తం సొమ్ముతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని, రోడ్లు నిర్మించుకుంటామని, చిన్నారులకు స్కూల్, కమ్యూనిటీ హాల్స్, ఇతర ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతామని, అలాగే ఆ మహిళ ఇంటిని సురక్షితంగా చూసుకుంటామని వారు చెప్పారు. అయినా అంతటి నిజాయితీ పరులు కనిపించడం అనేది ప్రస్తుత తరుణంలో జరిగే పనికాదు. వాళ్లు కాబట్టి తమ ప్రాంతానికి ఆ డబ్బును ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. వేరే వాళ్లు అయితే ఈపాటికే ఆ మహిళ ఆస్తులను మొత్తం పంచుకునేవారు..!