పెట్రోల్‌తో నడిచే మోపెడ్‌ను ఇ-బైక్‌గా మార్చింది ఆ యువతి..!

-

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. నిత్యం మనం చేస్తున్న అనేక తప్పుల వల్ల ఇప్పటికే పర్యావరణానికి తీవ్రంగా నష్టం కలుగుతోంది. దీనికి తోడు నిత్యం మనం ఉపయోగిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వల్ల పర్యావరణానికి తీవ్రంగా హాని కలుగుతోంది. అయితే ఈ నష్టాన్ని కొంత వరకు పూడ్చేందుకు, ప్రజల్లో ఎలక్ట్రికల్‌ వాహనాల పట్ల అవగాహన పెంచేందుకు ఆ యువతి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆమె ఓ టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోపెడ్‌ను బ్యాటరీతో నడిచే విధంగా తీర్చిదిద్దింది. అలాగే ఎకో ఫ్రెండ్లీ వాహనాల తయారీపై దృష్టి సారించింది. ఆమే.. హైదరాబాద్‌కు చెందిన రమ్య ప్రియ..!

this girl turned petrol moped into e-bike

సికింద్రాబాద్‌లో నివాసం ఉండే సీహెచ్‌ రమ్య ప్రియ తమిళనాడులోని పెరియార్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ డిగ్రీ సాధించింది. ఆమె తల్లి ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తుంగా, తండ్రి బీహెచ్‌ఈఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. కాగా రమ్యప్రియకు చిన్నప్పటి నుంచే బైక్‌లు, ఇతర వాహనాలను కొత్తగా తీర్చిదిద్దాలనే ఆసక్తి ఉండేది. అందులో భాగంగానే ఆమె డిగ్రీ చదివాక ఢిల్లీలోని ఎయిర్‌నాక్స్‌ ఇనిస్టిట్యూట్‌లో వాహనాల ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ మోడిఫికేషన్స్‌ టెక్నికల్‌ కోర్సును ఏడాదిపాటు చదివింది. ఆ తరువాత బైక్‌లపై తన ప్రయోగాలు మొదలు పెట్టింది.

రమ్యప్రియ 1994 సంవత్సరంలో తయారైన టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోపెడ్‌ను కేవలం 7 రోజుల్లోనే బ్యాటరీతో నడిచే విధంగా తీర్చిదిద్దింది. దాన్ని పెట్రోల్‌, ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా హైబ్రిడ్‌ బైక్‌గా మార్చింది. ఈ క్రమంలో ఆ మోపెడ్‌ పెట్రోల్‌ లేదా ఎలక్ట్రిసిటీతో రెండింటితోనూ నడుస్తుంది. అందులో అమర్చిన బ్యాటరీని 3 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే ఆ మోపెడ్‌పై 50 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇక ఇదే కాదు, గతేడాది కూడా రమ్యప్రియ ఇలాంటిదే ఓ వాహనం తయారుచేసింది. బైసైకిల్‌కు ఓ మోటార్‌ను అమర్చి దాన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చింది. దాన్ని చార్జింగ్‌ పెట్టుకుని వెళ్లవచ్చు. ఇక అందులో ఉన్న బ్యాటరీ పవర్‌ అయిపోతే దాన్ని యథావిధిగా సైకిల్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే రమ్యప్రియ ఆలోచన ఒక్కటే. చాలా తక్కువ ధరకే ఎకో ఫ్రెండ్లీ వాహనాలను తయారు చేయాలని..! త్వరలోనే ఆమె తన లక్ష్యాన్ని సాధిస్తుందని ఆశిద్దాం..!

Read more RELATED
Recommended to you

Latest news