జపాన్‌ టెక్నిక్‌తో నెలకు 35 శాతం డబ్బు ఆదా..! దశాబ్దాలుగా ‘కకేబో’ పద్ధతే.

-

డబ్బు ఆదా చేయాలని అందరూ అనుకుంటారు..కానీ అదేంటో చేతిలో మనీ ఉంటే..ఇట్టే ఖర్చు అయిపోతుంది. ఏది వాయిదాలేని ఖర్చులు, ఎంత అవుతుందో, ఎందుకు అవుతుందో అని తెలుసుకునే లోపే శాలరీ అంతా ఖాళీ అవుతుంటుంది. కానీ కొన్ని శతాబ్ధాలుగా జపాన్ ‘కకేబో’ అని పద్దతి ద్వారా డబ్బును ఆదా చేస్తుందట. జాగ్రత్తగా ఖర్చు చేయడంతో పాటు వివిధ అవసరాలకు డబ్బు ఎలా కేటాయించాలో ఈ విధానం తెలియజేస్తుంది. దీన్ని పాటించడం కూడా చాలా సులభం. దీని ద్వారా నెలకు దాదాపు 35 శాతం వరకు అధికంగా ఆదా చేయొచ్చని దీన్ని పాటించేవారు చెబుతుంటారు. ఈ పద్ధతి పాటించేందుకు ఎలాంటి సాంకేతికత అవసరం లేదు. పెన్ను, పేపర్ ఉంటే చాలు. ఎలానో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ పద్దతి కొందరు గృహిణులు పాటిస్తూనే ఉంటుంటారు. కానీ పూర్తిగా ఫాలో అవ్వరూ.

కకేబో అంటే…

జపాన్‌ భాషలో కకేబో అంటే ‘ఇంటి పద్దు పుస్తకం’ అని అర్థం. అంటే మన ఇంటి ఆదాయ, వ్యయాలను నమోదు చేసే పుస్తకమన్నమాట. ఈ పుస్తకంలో కొన్ని ప్రామాణిక ప్రశ్నలు, ఖర్చులు, పొదుపు లక్ష్యాలు, కొనుగోళ్ల ప్రాథమ్యాలు, నెలవారీ సమీక్షల వంటి వాటిని పొందుపరచాల్సి ఉంటుంది.. ఇప్పుడున్న అనేక బడ్జెట్‌ యాప్‌లకు ఈ కకేబోనే ఆధారం! అయితే, ఈ పద్ధతిలో ఎలాంటి డౌన్‌లోడ్‌లు, బ్యాంకు ఖాతా నెంబర్లు, లింక్‌లు అవసరం లేదు. పాతకాలం పద్ధతిలో వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి ఉంటుంది అంతే. జపాన్‌లో పుట్టిన ఈ విధానానికి ఇప్పుడు అమెరికాలో విశేష ఆదరణ లభిస్తోందంటే..ఇది ఎంతగా ఉపయోగపడుతుందో మీరే అర్థంచేసుకోండి. హనీ మొటొకో అనే జర్నలిస్ట్‌ తొలిసారి దీని గురించి ఓ మ్యాగజైన్‌లో రాశారు. 2018లో దీనిపై ఏకంగా ఓ పుస్తకమే విడుదలైంది.

  • ఒక పెన్ను పేపర్‌ తీసుకోండి. కాలిక్యులేటర్లు, గ్యాడ్జెట్స్‌లోని నోట్‌ప్యాడ్‌లు లాంటివి ఉపయోగించొద్దు. ఎందుకంటే పెన్ను, పేపర్‌తో రాయడం వల్ల మెదడుపై ఉన్న ప్రభావం గ్యాడ్జెట్ల వల్ల ఉండకపోవచ్చు.
  • మీ నెలవారీ ఆదాయాన్ని రాయండి. అందులో నుంచి స్థిర వ్యయాలను తీసేయండి. దీనికి కూడా కాలిక్యులేటర్లు ఉపయోగించొద్దు.
  • నెలవారీ పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె వంటి స్థిర వ్యయాలు పోయిన తర్వాత మిగిలిన సొమ్ముతోనే పొదుపు చేయాలి. అందుకే పొదుపు లక్ష్యం సహేతుకంగా ఉండాలి.

మీ ఖర్చుల కేటగిరీలను నమోదు చేయండి

అవసరాలు: ఈఎంఐలు, నిత్యావసరాలు, అద్దె

కోరికలు: అలవాట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌, రెస్టారెంట్లలో భోజనం, సినిమాలు

కల్చర్‌: పుస్తకాలు, సంగీతం, పండగలు మొదలైనవి

అనుకోని ఖర్చులు: పై కేటగిరీల్లోకి రాని అనారోగ్యం, ఇళ్లు, వాహన మరమ్మతుల వంటివి..

మీరు కొన్న ప్రతి వస్తువును, పెట్టిన ప్రతి ఖర్చును పైన తెలిపిన కేటగిరీల్లో పొందుపరచాలి. చాలా మందికి కోరికలు, అవసరాల మధ్య తేడా తెలియదు. వీటిపై సరైన అవగాహన పెంచుకోవాలి. అలాగే వాటికి అయిన ఖర్చు కూడా రాయాలి.

ప్రతినెలాఖరుకు ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి..

1. మన దగ్గర ఎంత డబ్బు ఉంది?

2. ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారు?

3. ఎంత ఖర్చు చేస్తున్నారు?

4. ఎలా మెరుగుపరుచుకోవాలి?

చివరి ప్రశ్న పూర్తిగా మీ వ్యక్తిగతమే. ఖర్చులు, అవసరాలు, లక్ష్యాలను బట్టి మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి. ఖర్చుల్ని తగ్గించుకున్నంత మాత్రాన పొదుపు చేయొచ్చనుకోవడం సరైన ఆలోచన కాదు. మీకు విలువ చేకూర్చి పెట్టేవాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే భవిష్యత్తులో రాబోయే అనుకోని ఖర్చులకు ముందే సిద్ధంగా ఉండాలి. వీటికి అనుగుణంగానే మీ ప్రణాళికను ఏర్పరుచుకోవాలి.

పొదుపు కంటే ఖర్చుపైనే దృష్టి పెట్టాలి..

చాలా మంది పొదుపు చేయాలనే ఉత్సాహం ఉంటుంది..దాంతో చేసే ఖర్చుపై దృష్టి పెట్టరు. నిజానికి ఖర్చుని నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా పొదపు పెరుగుతుంది. కకేబో ప్రధాన లక్ష్యం కూడా ఇదే. కాబట్టి మనం చేసే ప్రతి ఖర్చు వెనుక ఓ కారణం ఉండాలి. ఏదైనా అత్యవసరం కాని వస్తువును కొనేటప్పుడు ఈ కింది ప్రశ్నలు మీకు మీరే సమాధానం చెప్పుకోండి.

ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా?
నా ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని నేను కొనగలనా?
అసలు దీన్ని నేను ఉపయోగిస్తానా?
దీని గురించి నాకు ఎలా తెలిసింది? ఎక్కడ చూశాను?
ఈరోజు నా మానసిక పరిస్థితి ఎలా ఉంది?(ప్రశాంతంగా/ ఒత్తిడిలో/ ఆనందంగా/ బాధగా) (మన మానసిక స్థితే మన నిర్ణయాలను నిర్దేశిస్తుంది)
దీన్ని కొంటే నా ఫీలింగ్‌ ఎలా ఉంటుంది?(సంతోషం?ఉత్సాహం?ఈ రెండింటికీ భిన్నం? ఎంతకాలం ఉంటుంది?)

ఇతర పద్ధతులతో పోలిస్తే కకేబో కాస్త భిన్నం..ఎలా అంటే..

కకేబోలో ప్రతి ఖర్చును, ఆదాయాన్ని పెన్నుతో రాయాల్సి ఉంటుంది. చేతితో రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఇప్పటికే అధ్యయనాలు చెబుతున్నాయి. కంప్యూటర్‌, ఫోన్‌లో అంకెలు, అక్షరాలు నమోదు చేయడం కంటే చేతితో రాయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం ఏం రాస్తున్నామనే దానిపై మనకు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి ఖర్చును నోట్‌ చేయడంపై మనం కొంత సమయం వెచ్చిస్తాం. ఈ ప్రక్రియలో దేన్నీ ఆటోమేట్‌ చేయడానికి వీలుండదు. అప్పుడు అది మన బుర్రలో ఉండిపోతుంది. ముఖ్యంగా కొనుగోళ్లను కేటగిరీల్లో పొందుపరిచేటప్పుడు మీరు బాగా ఆలోచించాల్సి ఉంటుంది. అది తదుపరి వ్యయాలపై ప్రభావం చూపుతుంది. మరింత మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది.

పాశ్చాత్య దేశాల్లో ఈ విధానానికి బాగా ఆదరణ పెరుగుతోంది. నెలవారీ ఖర్చుల్లో దాదాపు 35 శాతం వరకు తగ్గించుకోవచ్చని దీన్ని పాటించిన వారు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్య..టైం వేస్ట్ అనుకోకుండా పెన్నూ, పేపర్ తీసుకుని ఒక నెల ఇలా చేయటానికి ట్రై చేయండి. ఖర్చుల మీద నియంత్రణ ఉండాలి, పొదుపు మీద అవగాహన ఉండాలి. చేయాలి చేయాలి అనుకుంటే డబ్బులు వాటంతట అవే పొదువు కావు కదా..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news