కరోనా నుండి కోలుకున్న వారిలో కనిపిస్తున్న మానసిక సమస్యలు..

కరోనా తీసుకొచ్చిన భయం జనాల్లో రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అన్ లాక్ 5.0లో భాగంగా అన్నీ తెరుచుకున్నా కూడా జనాల్లో భయాందోళనలు అధికంగా ఉన్నాయి. కరోనా ఉధృతి తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో సెకండ్ వేవ్ అనే అంశం గుబులు పుట్టిస్తుంది. మొదటి దానికంటే సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, మళ్ళీ లాక్డౌన్ తప్పదని వినిపిస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదొక్కటే కాదు కరోనా బారిన పడ్డవారికి ఎదురయ్యే సమస్యలు కూడా కలచివేస్తున్నాయి.

కరోనా నుండి కోలుకున్న చాలా మందిలో మానసిక సమస్యలు అధికం అయ్యాయట. కరోనాతో పోరాడి బయటపడి మళ్ళీ సాధారణ జీవనం గడుపుతున్న వారికి మానసిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయట. ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తాజా అధ్యయనం పేర్కొంది. మరీ ముఖ్యంగా నిద్రలేమి, నిరాశ, అనవసర ఆందోళన పెరిగిందని కనుక్కున్నారట.

కరోనా నుండి కోలుకున్న వారిపై జరిపిన అధ్యయనంలో దాదాపు 20శాతం మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. అందువల్ల కరోనా నుండి కోలుకున్నవారు ఇలాంటి ఇబ్బందులతో వస్తే వారికి చికిత్సలని గుర్తించాలని చెబుతున్నారు. ఇలాంటి రోగులు తక్కువగా ఉండవచ్చు కానీ సమస్య మాత్రం తీవ్రంగా ఉండనుందని, అందువల్ల కరోనా నుండి కోలుకున్నాక మరింత జాగ్రత్త అవసరం అని సూచిస్తున్నారు.