ఎయిరిండియా విమానాల్లో పనిచేసే సిబ్బంది ప్రయాణికులకు కచ్చితంగా సంప్రదాయ బద్దంగా నమస్కారం చేయాలని, అలాగే ప్రయాణికులతో ఎల్లప్పుడూ నవ్వుతూ మాట్లాడాలని అప్పట్లో చెప్పారు.
ఎయిరిండియా విమానయాన సంస్థ తన సిబ్బందికి తాజాగా జారీ చేసిన ఆదేశాలపై ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇకపై ఎయిరిండియా విమానాల్లో ఉండే సిబ్బంది అనౌన్స్‌మెంట్ అనంతరం కచ్చితంగా జైహింద్ అనాల్సిందేనని తాజాగా ఆ సంస్థ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎయిరిండియా డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అమితాబ్ సింగ్ తక్షణమే ఆ ఆదేశాలను పాటించాలని తేల్చారు. దీంతో ప్రస్తుతం ఎయిరిండియా విమానాల్లో పనిచేసే సిబ్బంది ప్రయాణికులకు చేసే అనౌన్స్‌మెంట్ అనంతరం జైహింద్ అంటున్నారు.
అయితే ఇలా జైహింద్ అనడం మంచిదేనని, దాంతో మనం భారతీయులం అన్న భావన అందరిలో కలుగుతుందని, దేశ భక్తి పెరుగుతుందని ఎయిరిండియా అధికారులు చెబుతున్నారు. కాగా 2016 మే నెలలో ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్వాని లోహని కూడా ఇదే తరహాలో ఆదేశాలు జారీ చేశారు. ఎయిరిండియా విమానాల్లో పనిచేసే సిబ్బంది ప్రయాణికులకు కచ్చితంగా సంప్రదాయ బద్దంగా నమస్కారం చేయాలని, అలాగే ప్రయాణికులతో ఎల్లప్పుడూ నవ్వుతూ మాట్లాడాలని అప్పట్లో చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం జైహింద్ అనాలనే మరో కొత్త ఆదేశాన్ని అమలులోకి తెచ్చారు.
కాగా ఇలా ఎయిరిండియా సిబ్బంది విమానాల్లో చేస్తున్న జైహింద్ నినాదం మంచిదేనని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా ట్వీట్లు పెడుతున్నారు. ముందు ఎయిరిండియా విమానాలను సరైన టైముకు నడపాలని, జైహింద్ అంటూ కూర్చుంటే మరో 20 నిమిషాలు విమానం ఆలస్యంగా నడుస్తుందని, జైహింద్‌తోపాటు జనగణమన కూడా పాడితే బాగుంటుందని… ఇలా రక రకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమంటారు.. అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి..!