ప్రస్తుత తరుణంలో అనేక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నది.. సెక్యూరిటీ సమస్య. హ్యాకర్లు రకారకాల విధానాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటాను చోరీ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో వారి బారి నుంచి వినియోగదారులు తమ ఫోన్లను సురక్షితంగా ఉంచుకోవడం అత్యంత ఆవశ్యకమైంది. అయితే స్మార్ట్ఫోన్లలో యూజర్లు స్టోర్ చేసుకునే డేటాకు సెక్యూరిటీ అందించే విషయానికి వస్తే ఆ విషయంలో ఐఫోన్లే అత్యుత్తమమని తేలింది. ఈ మేరకు కౌంటర్ పాయింట్ తాజాగా చేపట్టిన ఓ అధ్యయన వివరాలను వెల్లడించింది.
ఆపిల్ ఐఫోన్ 5ఎస్ మోడల్‌ను లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఫోన్లలో సెక్యూర్ ఎన్క్లేవ్ అనబడే ఓ ప్లాట్‌ఫాంను అందిస్తూ వస్తోంది. దీనివల్ల ఐఫోన్లలో యూజర్లు స్టోర్ చేసుకునే డేటాకు పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. యూజర్లకు చెందిన వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారం, ఇతర ముఖ్యమైన సమాచారం అంత సులభంగా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లదు. వారు ఆ డేటాను అంత ఈజీగా చోరీ చేయలేరు. అలాగే యూజర్లకు ప్రైవసీ కూడా లభిస్తుంది.
ఇక ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే వాటిల్లో ఆపిల్ ఐఫోన్ల మాదిరిగా సెక్యూర్ ప్లాట్‌ఫాంలు లేవు. చిప్ తయారీ కంపెనీలే అందుకోసం తమ చిప్సెట్లలో ప్రత్యేక సదుపాయాలను అందిస్తున్నాయి. కానీ అవి ఐఫోన్లలో ఉండే సెక్యూర్ ఎన్క్లేవ్ అంత సమర్థవంతంగా పనిచేయడం లేదని వెల్లడైంది. అందువల్ల ఐఫోన్లే యూజర్ల డేటాకు అత్యుత్తమమైన రక్షణను ఇస్తాయని కౌంటర్ పాయింట్ వెల్లడించింది..!