Rain: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి..వడగళ్ల వానతో ప్రజలు, అటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరద నీటితో మ్యాన్‌హోల్స్ మూసుకుపోయిన ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే చాలామందికి వర్షంలో తడవడం అంటే ఇష్టం ఉంటుంది. పైగా సినిమాల్లో వర్షం సీన్స్‌లో వాళ్లు తడుస్తూ తెగ ఎంజాయ్ చేస్తారు. అది చూసి మనం కూడా వర్షంలో తడుద్దాం అనుకుంటారు. కానీ మీకు తెలుసా.. వర్షంలో తడవడం వల్ల ఎన్ని కోట్ల బ్యాక్టీరియా మీపై చేరుతుందో.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
వర్షం నీళ్లు మంచివి అంటారు కదా.. మీరేంటి కోట్ల కొద్ది బ్యాక్టీరియా అంటున్నారు అనుకుంటున్నారా..? నల్ల మేఘాలు వస్తున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే.. తెల్ల మేఘాల కంటే.. నల్ల మేఘాలు ప్రమాదకరమైనవని ఓ పరిశోధన తేల్చింది. ఆ మేఘాల నిండా బ్యాక్టీరియా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓర్ని ఈ విషయం తెలియక.. నల్లటి మేఘాలు ఉన్నప్పుడు మనం బయటకు వచ్చి అబ్బ వెదర్ ఎంతబాగుందో అంటో తెగ సంబరపడిపోయామే..!!
ఈ నల్ల మేఘాలు భూమి అంతటా ఉంటున్నాయి. ఇవి అన్నిచోట్లా భారీ వర్షాలను కురిపిస్తున్నాయి. అందువల్ల అంతటా ఇవి బ్యాక్టీరియాను వెదజల్లుతున్నాయని ఫ్రాన్స్, కెనడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రాన్స్, కెనడాకి చెందిన సైంటిస్టులు.. ఈ నల్లమబ్బులపై లోతైన పరిశోధనలు చేశారు. తమ పరిశోధన ఫలితాల్ని ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ అనే సైన్స్ జర్నల్ మార్చి ఎడిషన్‌లో ప్రచురించారు శాస్త్రవేత్తలు.
ఫ్రాన్స్ మధ్యలోని ఫుయెడెడోమ్ అగ్నిపర్వతం దగ్గర్లో… సముద్ర మట్టానికి 4,806 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన వాతావరణ పరిశోధనా కేంద్రం… ఈ నల్ల మబ్బుల్లోని నీటి అణువుల శాంపిల్స్ సేకరించింది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 అక్టోబర్ మధ్య ఈ పరిశోధన జరిపారు. ఈ మబ్బుల్లోని బ్యాక్టీరియా… యాంటీ బయోటిక్ మందులకు లొంగుతుందా అనే దానిపై ఈ పరిశోధన జరిగింది..
మందులకు కూడా ఈ బ్యాక్టీరియా లొంగదట..
నల్లమబ్బుల్లోని మిల్లీమీటర్ నీటిలో 330 నుంచి 30 వేల రకాల బ్యాక్టీరియా ఉంది అని వారి అధ్యయనంలో తేలింది. యావరేజ్‌గా ఒక మిల్లీమీటర్ నీటిలో 8వేల రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు. వీటిలో 29 రకాల బ్యాక్టీరియా.. యాంటీ బయోటిక్ మందులను తట్టుకుంటోందని తేల్చారు. వర్షం పడనప్పుడు ఈ బ్యాక్టీరియా.. నేలపై, పంటలపై పడి.. అక్కడ జీవిస్తోంది. మందులకు లొంగని బ్యాక్టీరియా పంటలకు నష్టం కలిగిస్తోందట..మొత్తంగా నల్ల మబ్బుల నుంచి కింద పడిన బ్యాక్టీరియాలో 5 నుంచి 50 శాతం మాత్రమే బతికివుంటోందని తేల్చారు. ఈ బ్యాక్టీరియా వల్ల మనుషులకు ఎలాంటి నష్టం కలుగుతుందో ఇంకా తేల్చలేదు. ప్రస్తుతానికి నల్ల మబ్బుల వర్షంలో తడవడం ప్రమాదకరం అంటున్నారు.. కాబట్టి వర్షంలో తడవకండి..!