ఫిబ్రవరి నెల ముగింపుకు వచ్చేస్తోంది. మరికొద్ది రోజులు గడిస్తే.. మార్చి నెల వస్తుంది. ఆ నెల వస్తుందంటే చాలు.. విద్యార్థులందరికీ పరీక్షలు మొదలవుతాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంటుంది. పరీక్షలు సరిగ్గా రాస్తామా, లేదా.. పరీక్ష హాల్‌లో మనం చదివినవి గుర్తుకు వస్తాయా.. అన్న కంగారు ప్రారంభమవుతుంది. దీంతో పరీక్షలు సరిగ్గా రాయలేరు. సమయానికి చదువుకున్న సబ్జెక్టులోని అంశాలు కూడా గుర్తుకు రావు. దీంతో పరీక్ష ఫెయిల్ అవుతారు లేదా అత్తెసరు మార్కులతో పాసవుతారు. అయితే పరీక్షలంటే భయం ఉండే విద్యార్థులు కింద తెలిపిన పలు చిట్కాలు పాటిస్తే.. వాటితో పరీక్షలంటే ఉండే భయాన్ని వారు సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. మరి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కొందరికి పాఠాలను పెద్దగా బయటకు చదువుతూ నేర్చుకునే అలవాటు ఉంటుంది. కానీ వారిని శబ్దం రాకుండా చదవమని చెబుతుంటారు. నిజానికి అలా చెప్పరాదు. ఎలా చదివే వారు అలాగే చదివితే మంచిది. దీంతో పాఠాలను బాగా నేర్చుకుంటారు. అంతేకానీ.. వారిని శబ్దం రాకుండా చదవమని చెప్పకూడదు.
2. సబ్జెక్టుల్లో నేర్చుకునే ఒక అంశానికి, మరో అంశానికి మైండ్‌లోనే లింక్ పెట్టుకోవాలి. దీని వల్ల పరీక్ష హాల్‌లో పాఠాలు సులభంగా గుర్తుకు వస్తాయి.
3. మీరు చదువుతున్న పాఠాల్లో ఏవైనా ముఖ్యమైన పాయింట్లు కనిపిస్తే వాటిని మార్కర్‌లో అండర్‌లైన్ చేసుకోండి. పరీక్షకు వెళ్లేముందు ఒకసారి వాటిని చదువుకుంటే ఉపయోగం ఉంటుంది.
4. ముఖ్యమైన పాఠ్యాంశాలను చిన్న చిన్న కార్డులపై రాసుకుని వాటిని ఒక బుక్‌లా తయారు చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని చదువుకోవడానికి వీలుగా ఉంటుంది.
5. అదే పనిగా పాఠాలను చదవకుండా మధ్య మధ్యలో మెదడుకు కొంత విశ్రాంతి ఇవ్వండి. మీ హాబీలను పూర్తి చేయండి. దీంతో మీరు నేర్చుకుంది మెదడులో అలాగే ఉంటుంది. మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
6. ఎలాంటి కాలుష్యం, శబ్దాలు లేని ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వండి. దీని వల్ల పాఠాలను సులభంగా నేర్చుకోవచ్చు.
7. కొన్ని రకాల పాఠ్యాంశాలను నేర్చుకునేందుకు చిత్రపటాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఆయా అంశాలను బొమ్మలుగా వేసుకుని చదవండి. గుర్తుంటాయి. లేదా బొమ్మలతో ఉన్న పాఠ్యాంశాలను వాటితోనే చదవండి. బాగా అర్థమవుతాయి.
8. పరీక్షలకు ముందు నిద్ర కూడా బాగా ఉండాలి. లేదంటే పరీక్ష హాల్‌లో నిద్ర వచ్చి ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు.
9. ఒక్కరే కాకుండా, ఇద్దరు, ముగ్గురు స్నేహితులు కలసి చదువుకుంటే.. మరిన్ని పాఠ్యాంశాలను చాలా త్వరగా, సులభంగా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
10. పాఠ్యాంశాలను బట్టీ పట్టకుండా, వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఏ పాఠ్యాంశాన్నయినా ఇట్టే నేర్చుకోవచ్చు.
11. మెడిటేషన్, యోగా చేయడం వల్ల పరీక్షలంటే మీకున్న ఒత్తిడి, భయం పోగొట్టుకోవచ్చు.
12. మీకు ఇష్టమైన చక్కని సంగీతాన్ని వినండి. దీని వల్ల మెదడు ఉల్లాసంగా మారుతుంది. టెన్షన్ తగ్గుతుంది. ఎగ్జామ్ చక్కగా రాస్తారు.