ఉమెన్స్ డే స్పెషల్: తొలి మహిళా న్యూస్ రీడర్ ఎవరో తెలుసా..?

-

ఇప్పుడు న్యూస్ ఛానల్లలో మగవారికంటే ఆడవారే ఎక్కుమంది న్యూస్ ప్రెజంటర్స్ గా ఉంటున్నారు. ఆకట్టుకునే రూపం, మంచి కంఠస్వరం, సమాజం పై విషయ పరిజ్ఞానం..ఒక న్యూస్ రీడర్ కు కావాల్సిన లక్షణాలు. ఇవి ఉంటే చాలు.. జాబ్ కొట్టేయొచ్చు. అబ్బాయిలతో పోలిస్తే న్యూస్ ప్రజెంటర్స్ జాబ్ లో అమ్మాయిలదే హవా..ఇప్పుడు ఇలా ఉంది కానీ..ఒకప్పుడు ఆడవారు ఇంట్లోంచి బయటకు రావడానికే వందసార్లు ఆలోచించేవాళ్లు.. అలాంటిది టీవీ ముందు కుర్చోని వార్తలు చదవడం అంటే వారి తరమేనా అనుకునే రోజులవి. అలాంటిది.. భారతీయ టీవి చరిత్రలోనే మొదటిసారిగా వార్తలు చదివింది ఒక స్త్రీ కావడం ఎంత గొప్పవిషయం.. మరి అలాంటి రోజుల్లో కూడా ధైర్యంగా కెమేరా ముందు కుర్చోని వార్తలు చదివిన తొలి మహిళా న్యూస్ రీడర్ ఎవరో తెలుసా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ మంత్ సందర్భంగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే కదా..

వార్తలు చదవడానికి కంఠస్వరం, ఆకట్టుకునే రూపం ఉన్న వారినే యాజమాన్యం ఎంచుకుంటుంది. 1965లో ఆల్ఇండియా రేడియోలో భాగమైన దూరదర్శన్ వార్తా ఛానల్‌ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. టీవీ ద్వారా ప్రతిరోజూ వార్తలు అందించాలని ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌ను డిజైన్ చేశారు.. ఈ క్రమంలో సినిమ్లాలో పుట్టిపెరిగి.. అక్కడి ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేస్తున్న ప్రతిమా పూరీ వారి దృష్టిని ఆకర్షించింది. మధురమైన ఆమె స్వరం, అందమైన రూపం వారిని కట్టిపడేసింది. అంతే.. అప్పటికప్పుడు ఆమెతో ఆ ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్‌ను చదివించారు.

అలా దేశంలోనే మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ప్రారంభమైన ప్రతిమ వార్తల ప్రస్థానం..1967 వరకు నిర్విరామంగా కొనసాగింది. ఆరోజుల్లో టీవీ ఉన్న కుటుంబాలను వేళ్లమీద లెక్కేయొచ్చు. 1972 వరకూ దిల్లీలో తప్ప భారతదేశంలో మరెక్కడా టీవీలు లేవు. అయితేనేం నెహ్రూ వంటి ప్రముఖులు ఆమె న్యూస్ బులెటిన్‌ని క్రమం తప్పకుండా చూసేవారు. మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో కాలుమోపిన యూరీ గగారిన్‌ను ఆమె ఇంటర్వ్యూ చేయడం దూరదర్శన్ చరిత్రలో ఓ చెరగని ముద్ర. అంతేకాదు.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖుల్ని సైతం ఆమె ఇంటర్వ్యూ చేశారు.

న్యూస్ రీడర్ గా దూరదర్శన్ లో చేస్తున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత యాజమాన్యానికి మరికొంతమంది న్యూస్ రీడర్స్ అవసరమయ్యారు. ఈ క్రమంలోనే..కొత్తవారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యతను కూడా తమ మొదటి న్యూస్ రీడరైన ప్రతిమా పూరీకి అప్పగించారు. 1967లో సల్మా సుల్తాన్ ప్రతిమ స్థానాన్ని భర్తీ చేసింది. 2007 వరకు దూరదర్శన్‌కు ప్రతిమ తన సేవలను అందించారు. ప్రతిమగానే పాపులర్ అయిన ఆమె అసలు పేరు విద్యా రావత్. 2007లో తుది శ్వాస విడిచిన ప్రతిమ.. మహిళలు మీడియా రంగంలోకి ప్రవేశించడానికి, న్యూస్ రీడర్లుగా పైచేయి సాధించడానికి ప్రతిమ టార్చ్ బేరర్ లా నిలిచారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈరోజు జర్నలిజం చేసే ప్రతి మహిళ ఈమే స్టోరీని తప్పక తెలుసుకోవాలి. ఎదుటివారి తప్పును ధైర్యంగా గొంతెత్తి చెప్తున్న ప్రతి న్యూస్ ప్రజెంటర్ కు ప్రతిమ ఒక ఆదర్శం.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news