కరోనా ఉన్నప్పటికీ ప్రస్తుతం అనేక రెస్టారెంట్లలో అన్ని జాగ్రత్తలను పాటిస్తూ కస్టమర్లకు వంటకాలను వడ్డిస్తున్నారు. కరోనాకు ముందులాగే ఇప్పుడు దాదాపుగా అన్ని రెస్టారెంట్లు తిరిగి సేవలను ప్రారంభించాయి. కోవిడ్ నిబంధనల నడుమ వారు సేవలను అందిస్తున్నారు. అయితే రెస్టారెంట్లలో ఉన్నప్పుడు జనాలు మాట్లాడకుండా ఉంటే కోవిడ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు.
దక్షిణ కొరియాలోని జియొంజు అనే ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్లో ఒక కోవిడ్ పేషెంట్ పలువురికి కరోనా వచ్చేందుకు కారణమయ్యాడు. అతనికి సమీపంలో ఉన్న వారికి కరోనా సోకింది. ముఖ్యంగా ఆ రెస్టారెంట్లో ఉన్న సీలింగ్ ఎయిర్ కండిషనర్ వల్ల, కస్టమర్లు బాగా మాట్లాడడం వల్ల కరోనా ఒకరి నుంచి ఒకరికి సోకిందని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. కరోనా అలాంటి వాతావరణంలో 6 మీటర్ల దూరం వరకు వ్యాపించే అవకాశం ఉంటుందని కూడా గుర్తించారు.
అందువల్ల రెస్టారెంట్లలో ఉన్నప్పుడు జనాలు మాట్లాడకూడదని, అలాగే కేవలం ఆహారం తిన్నప్పుడు మాత్రమే మాస్క్ తీయాలని, మిగిలిన అన్ని సందర్భాల్లో మాస్క్ ఉంచుకోవాలని.. దీంతో కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.