విమానం నడుపుతుండగా ఇద్దరు పైలట్లు ఆదమరిచి నిద్రపోయారు. వారు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఆ విమానం ఆకాశంలోనే అరగంట పాటు చక్కర్లుకొట్టింది. ఇదంతా భూమికి 37వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా జరిగింది. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ (ఈఏ)కు చెందిన బోయింగ్ 737 విమానం ఈ నెల 15న సూడాన్ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాకు ప్రయాణమైంది. కొద్దిసేపటి తర్వాత పైలట్లు లోహవిహంగాన్ని ఆటోపైలట్ మోడ్‌లో ఉంచారు. ఆపై వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
ఆడిస్ అబాబాకు చేరుకున్నప్పటికీ ల్యాండింగ్‌కు వీలుగా విమానం ప్రయాణిస్తున్న ఎత్తు తగ్గింపు ప్రక్రియ ప్రారంభం కాకపోవడాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గుర్తించింది. వెంటనే అలర్ట్ జారీ చేసింది. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికి లోహవిహంగం 37 వేల అడుగుల ఎత్తులో ఉంది. గమ్యస్థానాన్ని దాటి వెళ్లిన తర్వాత ఆటోపైలట్ మోడ్ ఆగిపోవడంతో అలారం మోగింది. దీంతో పైలట్లు ఉలిక్కిపడి లేచారు. విమానాన్ని సురక్షితంగా ఆడిస్ అబాబాలో దించారు. పైలట్ల నిద్ర కారణంగా 25 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొడుతూ ఉండటం గమనార్హం.