త్వ‌ర‌లో ఫేస్‌బుక్ నుంచి కొత్త క‌రెన్సీ..!

-

ఫేస్‌బుక్ కొత్త‌గా ‘లిబ్రా’ పేరిట నూత‌న డిజిట‌ల్ కరెన్సీని అందుబాటులోకి తేనుంది. ఈ విష‌యాన్ని ఫేస్‌బుక్ స్వ‌యంగా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. 2020 వ‌ర‌కు లిబ్రా కరెన్సీ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆ సంస్థ తెలిపింది.

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న యూజ‌ర్ల‌కు కొత్త ఫీచ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఇక‌పై ఆ సంస్థ కొత్త‌గా ‘లిబ్రా’ పేరిట నూత‌న డిజిట‌ల్ కరెన్సీని అందుబాటులోకి తేనుంది. ఈ విష‌యాన్ని ఫేస్‌బుక్ స్వ‌యంగా ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. 2020 వ‌ర‌కు లిబ్రా కరెన్సీ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ క్ర‌మంలో ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం త‌దిత‌ర ఇత‌ర ఫేస్‌బుక్ యాప్‌లను వాడే యూజ‌ర్లు కూడా లిబ్రా క‌రెన్సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. దాన్ని త‌మ డిజిట‌ల్ వాలెట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకున్న క‌రెన్సీని అవ‌త‌లి వారికి చాలా తేలిగ్గా పంపుకోవ‌చ్చు. అలాగే ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లింపులు కూడా చేయ‌వ‌చ్చు. అయితే లిబ్రా క‌రెన్సీ ఏ మేర స‌క్సెస్ అవుతుంద‌నే.. ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది.

గ‌తంలో ఫేస్‌బుక్ డేటా చౌర్యం విష‌య‌మై అంద‌రిచే విమ‌ర్శ‌ల పాలైన విష‌యం తెలిసిందే. దీంతో ఆ సంస్థ వ్య‌వ‌స్థాపక సీఈవో జుకెర్ బ‌ర్గ్ అంద‌రి ఎదుట క్ష‌మాప‌ణ చెప్పారు. అయితే లిబ్రా క‌రెన్సీ గ‌నుక అందుబాటులోకి వ‌స్తే.. గ‌తంలో డేటా చౌర్యం అయిన‌ట్లు ఆ క‌రెన్సీని చోరీ చేయ‌లేర‌ని.. గ్యారంటీ ఏమిట‌ని ఫేస్‌బుక్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఆ సంస్థ మాత్రం అలాంటి ప‌రిస్థితి ఏ యూజర్‌కైనా ఎదురైతే చోరీకి గురైన మొత్తాన్ని చెల్లిస్తామ‌ని ఫేస్‌బుక్ పేర్కొంటోంది.

ఇక ఫేస్‌బుక్ తీసుకురానున్న లిబ్రా క‌రెన్సీని ఆయా దేశాలకు చెందిన ప్ర‌భుత్వ‌ ఆర్థిక సంస్థ‌లు ఆమోదించాల్సి ఉంటుంది.అంటే మ‌న దేశంలో బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల‌ను నియంత్రించే ఆర్‌బీఐ లాగే అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ‌లు ఆమోదించాలి. అప్పుడే లిబ్రా క‌రెన్సీ వినియోగం చెల్లుతుంది. అయితే ఈ దిశ‌గా ఫేస్‌బుక్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎందుకంటే.. ఒక్కో దేశంలో ఆర్థిక ప‌రిస్థితులు ఒక్కో ర‌కంగా ఉంటాయి. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న బిట్ కాయిన్‌ను కొన్ని దేశాలు ఆమోదిస్తే.. కొన్ని దేశాలు తిర‌స్క‌రించాయి. ఈ నేప‌థ్యంలో బిట్ కాయిన్ లాంటి క‌రెన్సీని తెస్తున్న ఫేస్‌బుక్ త‌న లిబ్రా కరెన్సీకి ఎలా ఆమోదం తెచ్చుకుంటుందో చూడాలి.

కాగా ఇప్ప‌టికే లిబ్రా క‌రెన్సీని ఆమోదించేందుకు అమెరికా స‌హా మ‌రో 12 దేశాల‌కు చెందిన మార్కెట్లు అనువుగా ఉన్నాయ‌ని తెలిసింది. మ‌న దేశంలో మాత్రం లిబ్రా క‌రెన్సీకి ఇంకా ఆమోదం ల‌భించ‌లేదు. అయితే సోష‌ల్ మీడియా ప‌రంగా భారీ స్థాయిలో యూజ‌ర్ల‌ను క‌లిగి ఉన్న భార‌త్‌, చైనా లాంటి దేశాల్లో లిబ్రా క‌రెన్సీకి ఆమోదం ల‌భించ‌క‌పోతే.. ఫేస్‌బుక్ ఆ కరెన్సీని ప్ర‌వేశ‌పెట్టి కూడా వృథాయే అవుతుంది. అందుక‌నే ఆ సంస్థ ఇప్పుడు ఎట్టిప‌రిస్థితిలోనూ మ‌న దేశంలో లిబ్రా క‌రెన్సీ చెలామ‌ణీలోకి వ‌చ్చే విధంగా ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. అందులో భాగంగానే ఫేస్‌బుక్ త్వ‌ర‌లో కేంద్రానికి లిబ్రా క‌రెన్సీ ఆమోదం విష‌య‌మై విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే బిట్‌కాయిన్ లాగే ప‌నిచేయ‌నున్న లిబ్రా క‌రెన్సీని ఎంత‌ మంది యూజ‌ర్లు న‌మ్ముతారు ? అస‌లు వారు ఆ క‌రెన్సీని కొనుగోలు చేస్తారా ? దాని వ‌ల్ల ప్ర‌త్యేక‌మైన లాభం ఏమైనా ఉంటుందా ? అనే కోణంలో ప‌రిశీలిస్తే.. ఈ క‌రెన్సీ ప‌ట్ల కొంద‌రు విముఖ‌తను ప్ర‌దర్శించే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే లిబ్రా క‌రెన్సీని కొనాలంటే.. దాని రేటును అమెరిడా డాల‌ర్‌, బ్రిట‌న్ పౌండ్, కువైట్ దీనార్‌.. త‌దిత‌ర క‌రెన్సీ రేట్ల‌లో ఉంచుతారా.. లేక త‌క్కువ రేటుకే ఇస్తారా.. అన్న‌ది కూడా తేలాల్సి ఉంది. దీనిపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఏదేమైన‌ప్ప‌టికీ ఫేస్‌బుక్ గ‌న‌క లిబ్రా క‌రెన్సీని నిజంగా స‌మ‌ర్థ‌వంతంగా అందుబాటులోకి తెస్తే.. ఆ సంస్థ టెక్ రంగంలో మ‌రింత ముందుకు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news