మీకొచ్చే జీతాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులో ఉండవో తెలుసుకోండి.

ఒకటవ తారీఖు వచ్చిందంటే చాలు, జీతం వస్తుందన్న ఆనందం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. నెల మొత్తం చేసిన పనికి వచ్చే జీతం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి జీతం అకౌంట్ లో పడిందన్న మెసేజ్ రాగానే ముఖం వెయ్యింతలుగా వెలుగుతుంది. కొండంత బలం వచ్చేస్తుంది. ఏమేమి అవసరాలకు డబ్బు అవసరమో అప్పుడే లెక్కలు వేసుకుంటారు. ఆ నెల మొత్తం ఆ డబ్బెలా ఖర్చుపెట్టాలో ప్లాన్ చేసుకుంటారు. ఐతే ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు.

నెల జీతం రాగానే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియకపోతే నెల ముగుస్తున్న సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మంత్ ఎండ్ వచ్చే సమయానికి ఎదుటివారిపై ఆధారపడాల్సి వస్తుంది. ఐతే మీ జీతం ఎంత ఉన్నా దాన్ని ప్లాన్ చేసుకునే తీరు బాగుంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు కలగకుండా ఉండవని గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక రూల్ తెలుసుకోవాలి. 50-30-20.

అవును, మీకొచ్చిన జీతాన్ని ఇలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు పడరు. మీ జీతం ఎంతైనా కానీ, అందులో 50శాతం మాత్రమే అవసరాలకి వాడండి. 30శాతం మీ కోరికలకి వెచ్చించండి. ఇంకా 20శాతం పొదుపు చేయండి. అంటే ఉదాహరణకి మీ జీతం 20వేలనుకుందాం. అందులో 10వేలు మీ అవసరాలకి, అనగా ఇంటి అద్దె కావచ్చు, వంట ఖర్చులు కావచ్చు. ఏదైనా అది లేకపోతే ఇల్లు నడవదు అనే ఖర్చులు. మిగతా 30శాతం అంటే 6వేలు మీ కోరికలకి, ఎక్కడికైనా సందర్శన ప్రదేశాలకి వెళ్ళడం కావచ్చు, ఇంకేదైనా కోరికలు కావచ్చు. ఇక మిగిలిన 20శాతం 4వేలు మాత్రం ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఇది పాటిస్తే జీవితంలో ఏదీ కోల్పోకుండా ఉండి జీవితం ఒక అందమైన అద్భుతంగా ఉంటుంది.