ఎమ్మెల్యే అంటే భద్రత ఏర్పాట్లన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. అధికార పార్టీ అంటే ఇంకాస్త ఎక్కువే హడావిడే ఉంటుంది. అయితే అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రైవేట్ గన్ మెన్లను బ్లాక్ క్యాట్ కమాండోల తరహలో ఏర్పాటు చేసుకోవడంతో హాట్ టాపిక్‌గా మారారు. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రైవైట్ భద్రతా సిబ్బంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కాదట. ఉత్తరాది నుంచి తీసుకువచ్చారని తెలిసి అంతా షాక్ అవుతున్నారు..
వివాదాలతో సావాసం చేసే మహబూబాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రైవేట్ గన్‌మెన్‌లను పెట్టుకుని సంచలనం రేపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ నేతలతో ఘర్షణకి దిగి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన ఎమ్మెల్యే ప్రైవేట్ గన్‌మెన్‌లను కూడా భద్రతకు పెట్టుకుని అధికార పార్టీలోచర్చ తెరతీశారు. బ్లాక్ క్యాట్ కమాండో స్థాయిలో ఉన్న ప్రైవేట్ గన్‌మెన్ అవసరం ఎమ్మెల్యేకు ఎందుకొచ్చింది
వారిని ఉత్తరాది నుంచి ఎందుకు తీసుకొచ్చారు అన్న అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో కథలు కథలుగా చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు మాత్రం తమ నేతకు ప్రమాదం పొంచి ఉండటం వల్లే ఈ భద్రతా ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. అసలు వారిని భయంతో ఏర్పాటు చేసుకున్నారా లేక స్టేటస్ కోసం తీసుకొచ్చారా అని ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఈ విధంగా ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోవడం టీఆర్‌ఎస్‌లో చర్చగా మారింది. ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలను, గొడవలను ఎమ్మెల్యే అనుచరులు ప్రస్తావిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలి కేసులు కూడా నమోదయ్యాయి. ఈ గొడవతో కసిమీద ఉన్నవారు ఎవరైనా తనపై ఎక్కడైనా అయినా దాడి చేస్తారన్న భయంతో ఎమ్మెల్యే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్‌తో వారు ప్రత్యర్ధులు కలిసిపోయి దాడులు చేస్తే ఎలా అన్న సందేహాలతో ఎవరికీ పరిచయం లేని ప్రైవైట్ గన్‌మెనన్లను నార్త్ నుంచి తీసుకొచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.