విజయనగరం జిల్లా బొబ్బిలిలో పక్కి గ్రామానికి చెందిన సత్తివరపు పకీరు అనే వ్యక్తి గురువారం స్థానిక కాలువలో చేపలు పట్టడానికి వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ఓ చేప వలలో కాకుండా.. అతని గొంతులో చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ చేప అతని గొంతులో పడడంతో.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా గొంతు లోపలికి వెళ్లిపోయింది. భయాందోలనకు గురైన పకీరును చూసిన తోటిజాలర్లు వెంటనే స్టానిక అస్పత్రికి తరలించారు.
అక్కడ డాక్టర్ ఆర్నిపల్లి గోపీనాథ్.. పకీరు గొంతులోని చేపను కొంత మేర కత్తిరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. అనంతరం డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. సకాలంలో పకీరును ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని లేదంటే చేప పూర్తిగా గొంతులోకి దిగిపోయి ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేదని చెప్పారు. అందుకే చేపలను తినేటప్పుడు అయినా.. పట్టేటప్పుడు అయినా జాగ్రత్తగా ఉండాలి.