దోమలకు పెద్దగా సీజన్‌తో పని లేదు.. ఏ కాలంలో అయినా వాటికి అనుకూలమైన వాతావరణం ఉంటే చాలు వచ్చేస్తాయి.. వీటివల్ల డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు కూడా మనకు బోనస్‌గా వస్తాయి. దోమలను నాశనం చేసేందుకు మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం.. అయితే చేపల వల్ల కూడా దోమలను నియంత్రించవచ్చని మీకు తెలుసా..? ఇప్పటికే ప్రభుత్వాలు మురికిగా ఉండే ప్రాంతాల్లో ఆ చేపలను వదులుతున్నాయి.. ఆ చేపల ముచ్చటేందో జర మీరు చూసేయండి.!
గంబూసియా చేపలు దోమల్లాగే తక్కువ నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనూ పెరగగలవు. ఇవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వీటిని నీటిలోకి వదులుతారు. దీంతో ఇవి దోమల లార్వాను తిని పెరుగుతాయి. ఈ చేపలకు ఆకలి ఎక్కువ. అందువల్ల కొంచెం వయస్సు వచ్చిన గంబూసియా చేపలు రోజుకు సుమారుగా 150కి పైగా దోమల లార్వాలను తినగలవు. దీంతో దోమలు పెద్దగా అవకముందే చనిపోతాయి.. ఇలా గంబూసియా చేపలతో దోమలకు అడ్డుకట్ట వేయవచ్చు.
గంబూసియా చేపలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ వంటి దోమలకు చెందిన లార్వాలను తింటాయి. అందువల్లే ఈ చేపలను పెద్ద ఎత్తున నీటి కుంటలు, చెరువుల్లోకి వదులుతారు. వీటి వల్ల దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు. దోమలతో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించింది.
గంబూసియా చేపలతో దోమలను నివారించవచ్చని, ఈ చేపల వల్ల ప్రజలకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపింది. అందువల్ల అనేక దేశాల్లో ప్రభుత్వాలు ఈ చేపలను.. దోమలను కట్టడి చేయడం కోసం ఉపయోగిస్తున్నాయి. అయితే గంబూసియాతోపాటు గప్పీ అనే ఇంకో రకానికి చెందిన చేపలను కూడా దోమలను చంపేందుకు వాడుతున్నారు. ఈ చేపలు కూడా గంబూసియా చేపల్లాగే దోమల లార్వాలను తినగలవు.
తెలుగు రాష్ట్రాల్లో గంబూసియా చేపలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో గప్పీ చేపలను వాడుతున్నారు. ఈ విధంగా చేపలతో దోమలను అంతం చేస్తున్నారు.