సెల్ఫీల వల్ల సంభవిస్తున్న మరణాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయని ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ అనే ఓ కథనంలో వివరాలను వెల్లడించారు.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న వారిలో అనేక మందికి సెల్ఫీల పిచ్చి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అయిందానికీ కానిదానికీ సెల్ఫీలు తీసుకుంటూ ఆ మాయలో పడి కొట్టుకుపోతున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు, కొన్ని సార్లు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సెల్ఫీలు తీసుకుంటూ అనవసరంగా మృతి చెందుతున్నారు. కాగా ఇలా సెల్ఫీలు తీసుకోవడం వల్ల సంభవిస్తున్న మరణాలు మన దేశంలోనే అధికంగా ఉన్నాయని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది.
సెల్ఫీల వల్ల సంభవిస్తున్న మరణాలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయని ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ అనే ఓ కథనంలో వివరాలను వెల్లడించారు. ఓ సంస్థ చేపట్టిన సర్వే తాలూకు విషయాలను అందులో ప్రచురించారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా షార్క్ చేపల దాడిలో అనేక మంది ప్రాణాలను కోల్పోతుంటే అంతకు 5 రెట్లు ఎక్కువగా సెల్ఫీల వల్ల జనాలు చనిపోతున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 2011 నుంచి 2017 మధ్య సెల్ఫీ మరణాలను లెక్కలోకి తీసుకుంటే మన దేశంలోనే అధికంగా 159 మంది సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయారని తేలింది.
ఇక ఆ తరువాతి స్థానంలో రష్యా ఉండగా, అక్కడ 16 మంది సెల్ఫీ తీసుకుంటూ చనిపోయారు. అమెరికాలో 14 మంది మృతి చెందారు. అయితే మన దేశంలో సెల్ఫీల వల్ల సంభవిస్తున్న మరణాల్లో అధిక శాతం యువత, మహిళలే ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, ఎత్తైన పర్వతాలు, భవంతుల పై నుంచి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడైంది.
అయితే ఇలాంటి సెల్ఫీ మరణాల కారణంగానే మన దేశంలోని చాలా ప్రాంతాల్లో నో సెల్ఫీ పేరిట బోర్డులను ఏర్పాటు చేశాయి. అలాగే ఆయా ప్రాంతాలను నో సెల్ఫీ జోన్లుగా ప్రకటించాయి. అయినప్పటికీ ఈ మరణాలు ఆగడం లేదు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని 16 ప్రాంతాల్లో సెల్ఫీలను తీసుకోవడంపై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు కూడా ప్రమాదకరమైన స్థితిలో, ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవద్దని, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. ఏది ఏమైనా.. సెల్ఫీలంటే ఇష్టపడే వారు.. నిజంగా ఒకసారి ఆలోచించండి.. ప్రాణాల మీదకు తెచ్చుకునేలా సెల్ఫీలను తీసుకోకండి.. జాగ్రత్తగా ఉండండి..!