అంతర్జాతీయ కరాటే ప్లేయర్.. పొలాల్లో కూలీగా మారింది.

-

దేశ పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద రెపరెపలాడించిన క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారడం అప్పుడప్పుడు చూస్తునే ఉన్నాం. దేశం గర్వించేలా చేసి, ప్రపంచ యవనికపై ధృవతారలా మెరిసిన మెరుపులు ఇప్పుడు ఆరిపోతున్నాయి. కప్పు చేతుల్లో పట్టుకున్న చేతులు పలుగు పార పట్టి పొలం పనులకి వెళ్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని మన్సా జిల్లాలోని గుర్నే కలాన్ గ్రామంలో కరాటే ప్లేయర్ పరిస్థితి ఇలాగే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన ఈ క్రీడాకారిణి, ప్రస్తుతం పొలాల్లో కూలీగా మారింది.

కరాటే ప్లేయర్

హర్దీప్ కౌర్.. అంతర్జాతీయ స్థాయి కరాటే ప్లేయర్. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ఎన్నో పతకాలు గెలుచుకుంది. మలేషియాలో జరిగిన పోటీల్లో బంగారు పతాకాన్ని సాధించుకుని దేశం గర్వించేలా చేసింది. ఐతే ప్రస్తుతం హర్దీప్ కౌర్ పొలాల్లో కూలీ పనులు చేసుకుంటుంది. జీవన ప్రయాణంలో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పలుగు పార పట్టి పొలం పనులకు వెళ్తుంది. రోజుకి 300రూపాయల కూలీ వేతనంతో బ్రతుకు జీవనాన్ని సాగిస్తుంది. మలేషియాలో పతకం సాధించుకున్న తర్వాత అప్పటి క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ సోధి తన ప్రాంతాన్ని సందర్శించి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తానని మాటిచ్చాడు.

ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగం హర్దీప్ కౌర్ ఇంటిని పలకరించలేదు. దాంతో తన తండ్రితో పాటు కూలీ పనులకు వెళ్తుంది. దేశం గర్వించే క్రీడాకారులు, అధ్లెట్లకి సరైన సదుపాయాలు అందకపోవడం విచారించాల్సిన విషయం. క్రీడల్లో మన దేశం వెనకబడిపోవడానికి ఇది కూడా ఓ కారణమని హర్దీప్ కౌర్ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news