ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన మామిడి పండ్ల‌ను పండిస్తున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్ సోద‌రులు..!

ప్ర‌పంచ వ్యాప్తంగా మామిడి పండ్ల‌లో అనేక వెరైటీలు ఉన్నాయి. మ‌న దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో భిన్న వెరైటీల‌కు చెందిన మామిడి పండ్ల‌ను పండిస్తున్నారు. ఇటీవలే మ‌ధ్య ప్ర‌దేశ్‌కు చెందిన ఓ జంట అత్యంత ఖ‌రీదైన మామిడి పండ్ల‌ను పండించి వార్త‌ల్లో నిలిచింది. ఇక అదే రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు సోద‌రులు ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన మామిడి పండ్ల వెరైటీని పండిస్తూ వార్త‌ల్లో నిలిచారు.

madhya pradesh brothers growing heaviest mangoes

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌పురా గ్రామానికి చెందిన రామేశ్వ‌ర్‌, జ‌గ‌దీష్ అనే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు త‌మ తోట‌లో సుమారుగా 1000 మామిడి చెట్ల‌ను పెంచుతున్నారు. వాటికి 50 ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు పండుతున్నాయి. అయితే ఆమ్ర‌పురి అనే అత్యంత బ‌రువైన మామిడి వెరైటీతోపాటు బాగా తియ్య‌గా ఉండే సెన్సేష‌న్ అనే మామిడి వెరైటీని కూడా వారు పండిస్తున్నారు.

ఆమ్ర‌పురి మామిడి వెరైటీ ప్ర‌పంచంలోని అత్యంత బ‌రువైన మామిడి పండ్ల‌లో ఒక‌టి. ఇది ఒక్కో పండు సుమారుగా 4.50 కిలోల బ‌రువు వ‌ర‌కు పండుతుంది. కేజీకి రూ.1000 ధ‌ర ప‌లుకుతుంది. ఇక ఫ్లోరిడాకు చెందిన సెన్సేష‌న్ అనే వెరైటీ పండు కూడా కేజీకి రూ.1000 ప‌లుకుతోంది. అలాగే వారు ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మాల్దా, హిమ‌సాగ‌ర్‌, గుజ‌రాత్‌కు చెందిన కేస‌ర్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన లాంగ్రా, బీహార్‌కు చెందిన చౌన్సా అనే మామిడి వెరైటీల‌ను కూడా వారు పండిస్తున్నారు.

ప్ర‌స్తుతం సీజ‌న్ కావ‌డంతో త‌మ‌కు గిరాకీ బాగానే ఉంద‌ని వారు చెబుతున్నారు. త‌మ‌కు దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి ఆ పండ్ల కోసం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని, దుబాయ్ నుంచి కూడా ఆ పండ్ల‌ను ఆర్డ‌ర్ చేస్తున్నార‌ని చెబుతున్నారు.