పాములతో నిండిన బావిలోకి దిగి.. నెమలిని రక్షించిన వ్యక్తి.. వైరల్ వీడియో..!

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో నివసించే జంతువులు, పక్షులు, ఇతర జీవాలకు ఏదైనా ఆపద వస్తే వాటిని రక్షించే జంతు ప్రేమికులు చాలా మందే ఉంటారు. వారు ఎంతటి ప్రాణాపాయ స్థితిలోనైనా సరే.. ఆపదలోఉన్న మూగజీవాలను రక్షిస్తుంటారు. ఇప్పటికే మనం అలాంటి ఎన్నో సంఘటనలను చూశాం. తమిళనాడులో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పాములతో నిండిన ఓ బావిలో పడ్డ నెమలిని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఈ క్రమంలో అతను ఆ నెమలిని రక్షించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

man rescued peacock from snake infested well

అది ఓ వ్యవసాయ బావి. బావిలో 30 అడుగుల లోతు వద్ద నీరు ఉంది. అందులో ఎన్నో పాములు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ బావిలోకి దిగాలంటే నిజంగానే ఎవరైనా అంత సాహసం చేయరనే చెప్పాలి. ఈత వచ్చిన వారు కూడా అందులో ఉన్న పాములకు భయపడిపోతారు. అలాంటి స్థితిలో ఆ బావి ఉంది. అయితే ఆ విషయాలను అతను ఏమీ పట్టించుకోలేదు. అందులో పడ్డ నెమలి కోసమే అతని తాపత్రయమంతా.. అందుకనే తాళ్ల సహాయంతో చాలా చాకచక్యంగా బావిలోకి దిగి పాములను తప్పించుకుంటూ ఎట్టకేలకు ఆ నెమలిని రక్షించాడు. అయితే ఆ సమయంలో అతను అలా నెమలిని రక్షిస్తుండగా కొందరు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. నెమలిని ప్రాణాలకు తెగించి మరీ రక్షించిన ఆ వ్యక్తిని అందరూ అభినందిస్తున్నారు..!