పెళ్ళి: అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు ఎక్కువగా ఉండాలి? కారణాలు..

భారతదేశంలో పెద్దలు చేసే వివాహాల్లో చాలా శాతం ఆడవాళ్ల వయసు కంటే మగవాళ్ళ వయసు ఎక్కువగానే ఉంటుంది. అలా ఉండేలా చేస్తారు. మగవాళ్లని వాళ్ళ కంటే పెద్దవారైన ఆడవాళ్లతో పెళ్ళి జరిపించరు. ఐతే ప్రస్తుతం ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ పద్దతి కొద్ది కొద్దిగా కనుమరుగు అవుతుంది. అదలా ఉంచితే, ఆడవాళ్ళ కంటే ఎక్కువ వయసున్న మగవారితో వివాహం జరిపించడం చాలా కారణాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

పండితుల ప్రకారం ఆడవాళ్ళు తక్కువ వయసులోనే పరిణతి చెందుతారని అభిప్రాయం. మగవారు పరిణతి చెందడానికి కావాల్సిన వయసు కన్నా ఆడవాళ్ళు పరిణతి చెందడానికి కావాల్సిన వయసు తక్కువ. ఆ ఉద్దేశ్యంతో తమ కంటే ఎక్కువ వయసున్న మగవారితో వివాహం జరిపిస్తారు. ఇదే కాదు మగవాళ్ళ వయసు ఎక్కువగా ఉంటే బంధంలో మనస్పర్థలు రావని కొందరి వాదన. అదెలా అంటే, ఎక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ జీవితాన్ని చూసి ఉంటారు. కాబట్టి తమ భాగస్వామి కన్నా తమకి ఎక్కువగా తెలుసు.

జీవిత ప్రయాణంలో ఆ అనుభవం బలాన్నిస్తుంది. అదీగాక ఎక్కువ వయసు ఉన్నవారు ఎక్కువ సంపాదించి ఉంటారు. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. వివాహం వరకి సమయం ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు సంపాదించే టైమ్ కూడా ఎక్కువే. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇంకా తమకంటే వయసులో చిన్నవారిని చేసుకోవడం వల్ల అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. అహం పెద్దగా ఉండదు. ఒక రిలేషన్ షిప్ లో ఉండకూడనిది అదే. దానివల్ల సంసార నావ సాఫీగా సాగుతుంది.

మగవారు పెద్దవారు కాబట్టి గౌరవ భావం ఆడవాళ్ళలో పెరుగుతుందనేది మరొక వాదన. ఏది ఏమైనా ఇలా రకరకాల వాదనలతో ఈ విషయం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి.