ఈ బాతు ఈకలు బంగారంతో సమానమట..ఎందుకంత కాస్ట్ అంటే..!

చిన్నప్పుడు నెమలి ఈకలంటే చాలామంది పిల్లలకు ఇష్టం ఉండేది. అదేదో బంగారం అన్నట్లు దాన్ని జాగ్రత్తగా దాచుకునే వాళ్లు. ఆ ఈకల్లో ఉండే వివిధరంగులను ఎలాగోలా సేకరించి..పుస్తకాల్లో భద్రంగా పెట్టుకోవడమే కాదు..కొంతమంది అయితే..వాటికి మేత అని ఏవేవో వేస్తుంటారు. భలే ఉంటుంది కదా..చిన్నప్పుడు మనం చేసినవన్నీ గుర్తుకువస్తే. అసలు నెమలి ఈకలు బుక్స్ లో ఉంటే చదువుబాగా రావడమేంటో..సరే ఆ విషయం పక్కన పెడితే..అత్యంత ఖరీదైన ఈకలు గురించి ఇప్పుడు చూద్దాం. ఈడర్ పోలార్ బాతు ఈకలు బంగారం కంటే ఎక్కువ విలువ అంట. ఇవి ఐస్‌లాండ్‌లో మాత్రమే ఈ బాతులు నుంచి తీసిన ఈకలను 3.71లక్షలకు అమ్ముతారట. ఓడియమ్మ..అంత ఖర్చుపెట్టి కొని ఈకలలో ఏం చేస్తార్రా అనుకుంటున్నార్రా..అయితే ఇది మొత్తం చదివేయండి మరీ..!

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్‌ ఈ బాతు ఈకల్లోనే ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇవి చాలా తేలికైనవిగా ఉండటంతోపాటు శరీరానికి ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. దీంతో ఖరీదైన దుస్తులు, బ్యాగులు, ఇతర వస్తువులు తయారు చేసే సంస్థలు ఈ బాతు ఈకలను సేకరించడం మొదలుపెట్టాయి. అలా వీటికి డిమాండ్ బీభత్సం‌గా పెరిగింది. ఒక్కో బాతు నుంచి అతి స్వల్ప మొత్తంలోనే ఈకలు లభిస్తాయి. అందుకే, ఎంత వీలైతే అంత ఎక్కువ ఈకలు సేకరించడం కోసం కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికైనా వెనుకాడటంలేదు.

ఈడర్‌ పోలార్‌ బాతుల ఈకలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో స్థానిక నిరుద్యోగులకు ఇదో మంచి ఆదాయంగా మారింది. వారంతా ఈకలను సేకరించి కంపెనీలకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఈ బాతులు గుడ్లు పెట్టి పొదిగే సమయంలో ఈకలు రాలి కిందపడుతుంటాయి. వాటిని సేకరిస్తుంటారు. ఒక కిలో ఈకలను సేకరించాలంటే దాదాపు 60 బాతులు అవసరం ఉంటుంది. మరి ఇంత డిమాండ్ ఉందని..దొరికినకాడికి బాతులను పట్టుకుని వాటిని చంపి ఈకలు పీకేస్తారనుకుంటున్నారేమో..బంగారు గుడ్డుపెట్టే బాతును పెంచుకుంటే..రోజుకో గుడ్డుపెడుతుంది..అది చంపేసి పొట్టలో గుడ్లన్నీ తీసుకోవాలనుకోవటం వెర్రితనం..ఈ పాయింట్ ఇక్కడివారికి బాగా తెలుసు..ఒకవేళ బాతులు వారికంట పడినా వాటికి హాని తలపెట్టరు. ఈకలు సేకరించిన తర్వాత బాతును వదిలేస్తారు. కొన్నాళ్లకు బాతుకు మళ్లీ ఈకలు వస్తాయి. ఇలా ఏడాదిలో మూడుసార్లు ఈకల సేకరించటం ఈకబిజినెస్ తో వారికి మంచి ఉపాధి పొందుతున్నారు.