అన్ని సబ్జెక్టుల్లో వచ్చింది 35 మార్కులే.. కానీ టాపర్ కన్నా ఫేమస్ అయ్యాడు..!

టాపర్ కంటే కూడా ఆ విద్యార్థి ఫేమస్ అయ్యాడు. అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకొని మీడియా కంటికి చిక్కాడు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశమంతా మనోడి గురించే చర్చ.

మహారాష్ట్ర బోర్డు పరీక్ష ఫలితాల్లో ఓ వింత చోటు చేసుకున్నది. సాధారణంగా పాస్ అయ్యే మార్కులు ఎన్ని 35. 35 మార్కులు వస్తే బార్డర్ లో పాస్ అయినట్టు లెక్క. అయితే.. కొంతమంది విద్యార్థులకు కొన్ని సబ్జెక్టుల్లో బార్డర్ మార్కులు రావడం చూస్తుంటాం. కానీ ఒకే విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు రావడం ఎక్కడైనా చూశారా? మహారాష్ట్ర బోర్డులో మాత్రం అదే జరిగింది. ఓ విద్యార్థికి అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులే వచ్చాయి.

ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో టాపర్ కంటే కూడా ఆ విద్యార్థి ఫేమస్ అయ్యాడు. అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు తెచ్చుకొని మీడియా కంటికి చిక్కాడు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే కాదు దేశమంతా మనోడి గురించే చర్చ.

ఆ స్టూడెంట్ ఎవరో కాదు.. ముంబైకి చెందిన అక్షిత్ జాదవ్. అతడికే ప్రతి సబ్జెక్ట్ లో 35 మార్కులు వచ్చాయి. అక్షిత్ 9వ తరగతిలో ఫెయిల్ అవడంతో టెన్త్ పరీక్షలు ప్రైవేట్ గా రాశాడట. కానీ.. కనీసం 55 మార్కులైనా వస్తాయని అతడి తండ్రి అనుకున్నాడట కానీ.. ఇలా అన్ని సబ్జెక్ట్ ల్లో 35 మార్కులు వస్తాయని ఊహించలేదంటూ చెప్పడం గమనార్హం. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? ఈ విద్యార్థి మామూలు విద్యార్థి కాదు.. ఇది మామూలు రికార్డు కాదు.. టాపర్ కు కూడా ఇంత పేరు రాదు.. ఇది నేషనల్ రికార్డు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే.. దీనిపై సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా సాగుతోంది. ఇదంతా ఉత్త ప్రచారమేనని.. అది ఫేక్ అని.. కావాలని సోషల్ మీడియాలో లేనిపోనివి సృష్టిస్తున్నారని.. మహారాష్ట్రలోనే ఇలాంటి వార్త మరోటి వైరల్ అవుతోందని చెబుతున్నారు. శ్రవణ్ అనే విద్యార్థికి కూడా అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు వచ్చాయని అతడి మార్కులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.