దెయ్యాలు నిర్మించిన దేవాలయం.. ఎక్కడో తెలుసా?

-

ఎట్టెట్టా? దెయ్యాలు గుడిని కట్టాయా? మేం ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నామా అని అనకండి. ఎందుకంటే.. పురాణాలు చెబుతున్నాయి ఆ గుడిని దెయ్యాలు కట్టాయని. దెయ్యాలు ఉన్నాయి.. అని నమ్మేవాళ్లు మాత్రమే ఈ వార్త చదవడం బెటర్. ఎందుకంటే.. దెయ్యాలు ఉన్నాయని నమ్మని వాళ్లు ఈ వార్తను చదివినా నమ్మలేరు. సరే.. ఇంతకీ దెయ్యాలు ఆ గుడిని ఎలా కట్టాయి.. ఎందుకు కట్టాయి.. ఎక్కడ కట్టాయి అనే విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే పదండి..

ఆ గుడి కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని బొమ్మవర అనే గ్రామంలో ఉంది. ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం. అంటే శివుడి గుడి. ఆ గుడిలో ఉంటే శివలింగం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఆ గుడికి సుందరేశ్వరాలయం అని పేరు.

బొమ్మవర గ్రామంలో వందల ఏళ్ల క్రితం దెయ్యాలు జనాలను భయపెట్టేవట. జనాలను ప్రశాంతంగా ఉండనివ్వకపోయేదట. దీంతో ఆ ఊరు ప్రజలకు ఏం చేయాలో అర్థం కాకపోయేదట. అదే ఊరికి చెందిన దెయ్యాల మాంత్రికుడు దెయ్యాలను తరిమికొట్టడానికి మంత్ర విద్యలను నేర్చుకున్నాడట. ఆ విద్యలతో దెయ్యాలను తరిమికొట్టాలని చూసినా ఆయనకు కుదరలేదట. దీంతో అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దెయ్యాలు పారిపోతాయని తెలుసుకొని ఊరి ప్రజలందరి సహకారంతో గుడిని నిర్మించాడట ఆ మాంత్రికుడు.

ఆ ఊళ్లో శివాలయం నిర్మించడంతో తట్టుకోని ఆ దెయ్యాలు ఆ గుడిని ఓ రాత్రి నాశనం చేసేశాయి. దీంతో కోపోద్రికుడైన ఆ మాంత్రికుడు మరిన్ని మంత్రవిద్యలు నేర్చుకొని ఆ దెయ్యాలను మంత్రశక్తితో తన వశం చేసుకున్నాడు. వాటి జుట్టు కత్తిరించి తన దగ్గర బంధించాడు. దీంతో అవి బంధీ అయిపోయాయి. తమను విడిపించాలంటూ ఆ దెయ్యాలు ఆ మాంత్రికుడిని వేడుకున్నాయి. దీంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి.. ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ మాంత్రికుడు వాటికి చెప్పాడు. తప్పని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక.. రాత్రికి రాత్రే ఆ గుడిని అవి పునర్నిర్మించాయట.

అంతే కాదు.. ఆ గుడి మీద ఉండే బొమ్మలను చూసినా ఆ గుడిని దెయ్యాలే నిర్మించాయని తెలుస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆ గుడి మీద అన్నీ దెయ్యం బొమ్మలే ఉంటాయట. గుడిని మళ్లీ నిర్మించిన ఆ దెయ్యాలు గుడిలో శివలింగాన్ని ప్రతిష్టించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట. దీంతో అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండా.. అలాగే ఉండేదట.

తర్వాత 50 ఏళ్ల కింద ఆ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఓ బావిని తవ్వుతంటే పెద్ద శివలింగం బయట పడిందట. ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్టించారట. అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు. ఆ శివలింగం 8 అడుగుల ఎత్తు ఉందట. ఇక.. ఈ గుడిని దెయ్యాలు కట్టినప్పటికీ.. ఎలాగూ శివుడు భూతనాథుడు కాబట్టి.. ఆయనకు ఈ గుడిలో పూజలు చేస్తున్నారట అక్కడి స్థానికులు. ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ ప్రాంత వాసులకు అంతా మంచే జరిగిందట. అలా అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు చేయడం మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version