జీవితంలో ప్రతి వ్యక్తికి సొంత ఇంట్లో ఉండాలనే కల ఉంటుంది. ఎన్ని రోజులు అద్దె ఇండ్లలో ఉండాలని భావించే వారు సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. అయితే చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఏమోగానీ హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే సొంతిల్లు ఉండాలంటే.. అందుకు ఎంత సొమ్ము వెచ్చించాలో అందరికీ తెలుసు. లక్షల రూపాయలు ధారపోస్తే గానీ ఒక మోస్తరు ఇల్లు రాదు. ఇక సిటీ మధ్యలో సొంతిల్లు ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలు చెల్లించాల్సిందే. కానీ ఇటలీలోని ఆ ప్రాంతంలో మాత్రం కేవలం 1 డాలర్ (దాదాపుగా రూ.71)కే సొంతిల్లు వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. రూ.71 చెల్లిస్తే అక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు. ఇంతకీ ఏమా కథ ? ఎక్కడ ఆ ప్రాంతం ? అంటే…
ఇటలీలోని సంబుకా అనే టౌన్ పరిధిలో ఉన్న సిసిలీ అనే గ్రామం నిజానికి ఒక పర్యాటక ప్రదేశం. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చిక బయళ్లు, బీచ్.. అలాంటి వాతావరణంలో ఉండడం అంటే అంతకు మించి కావల్సింది ఏముంటుంది చెప్పండి. అయితే ఇప్పుడక్కడి స్థానికులు కేవలం 1 డాలర్‌కే తమ ఇండ్లను అమ్ముతున్నారు. అవును.. అక్కడ చాలా ఇండ్లు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాయట. వాటిని ఎవరూ కొనడం లేదట. దీంతో ఆ ప్రాంతం స్వతహాగానే పర్యాటక ప్రాంతం కావడంతో ఖాళీగా ఉన్న ఇండ్లను యజమానులు కేవలం 1 డాలర్‌కే అమ్ముతున్నారు.
అయితే ఆ ప్రాంతంలో ఇండ్లను కొనాలంటే ఎవరైనా ముందుగా 5700 డాలర్లు డిపాజిట్ చేయాలి. అనంతరం తాము కొనుగోలు చేసిన ఇంటిని మరమ్మత్తులు చేయించి అందంగా తీర్చిదిద్దాలి. ఆ తరువాత వారు డిపాజిట్ చేసిన 5700 డాలర్లను వెనక్కి ఇచ్చేస్తారు. అంటే.. దాదాపుగా ఉచితంగానే ఇంటిని తీసుకోవచ్చన్నమాట. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో నివాసం ఉండే వారి సంఖ్య పెరుగుతుందని, దాంతో ఆ ప్రాంతానికి టూరిస్టు ఆదాయం వస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. మరి.. ఇంకెందుకాలస్యం.. 1 డాలర్‌కే ఇంటిని కొనుగోలు చేయాలంటే.. ఇటలీకి వెళ్లి రండి మరి..!