మీకు ఏదైనా కొత్త ఫోన్ కొనాలనిపించినా.. లేదా పాత ఫోన్(Old mobile) పాడైపోయినా కొత్త మొబైల్ కొనుక్కుంటారు. మరి, పాత మొబైల్‌ను రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటుంది. కానీ, పాత స్మార్ట్‌ఫోన్ ను అమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ విక్రయిస్తే.. ముందుగా రీసెట్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే చిక్కులు తప్పవు. రీసెట్ చేయకుండా మొబైల్ అమ్మారంటే మీ పర్సనల్ డేటాను వారి చేతుల్లో పెట్టినట్టే. ఛాట్స్, ఫోటోలు, సెల్ఫీలు, డాక్యుమెంట్ ఫైల్స్, ఇలా ఆ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న వివరాలు, ఫైల్స్ అన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతాయి.ఒకవేళ అందులో ముఖ్యమైన ఫైల్స్, ఫోటోస్ లాంటివి ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా, వాటిని దుర్వినియోగం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ ఫైల్స్ అన్నీ బ్యాకప్ పెట్టుకొని స్మార్ట్‌ఫోన్‌ను రీసెట్ చేసుకోవాలి. అప్పుడే నిర్భయంగా మీ ఫోన్ అమ్మవచ్చు.
అంతకు ముందు మీరు వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ అంటే గూగుల్, వాట్సప్ అకౌంట్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి అన్ని అకౌంట్స్ నుంచి లాగౌట్ కావాలి. దీనికోసం సెట్టింగ్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేస్తే మీరు ఆ స్మార్ట్‌ఫోన్ లో లాగిన్ అయిన అకౌంట్ల వివరాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత మీ ముఖ్యమైన ఫైల్స్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్యాకప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అప్పుడే మీ డేటా సేఫ్టీగా ఉంటుంది. దీనికి సెట్టింగ్స్‌లో రీసెట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో అకౌంట్స్, ఫోటోస్, వీడియోస్, యాప్స్, ఎస్డీ కార్డ్ డేటా లాంటి ఆప్షన్ ఉంటాయి. ఇవి కాకుండా Erase all data లేదా Reset factory data ఉంటాయి. దానిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ రీసెట్ అవుతుంది. ఇప్పుడు ఏ భయం లేకుండా ఎవరికైనా మీ స్మార్ట్ ఫోన్ అమ్మేయవచ్చు.