అవునా.. ఎప్పుడు అంటూ ఆవేశ పడకండి. దాంట్లో పెద్ద తిరకాసు ఉంది. అది తెలుసుకోవడానికంటే ముందు మనం ఓసారి 2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు నరేంద్ర మోదీ ఏమన్నాడు.. విదేశాల్లో ఉన్న నల్లధనం అంతా వెలికి తీస్తే ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు వేయొచ్చని చెప్పాడు కదా. జనాలు కూడా నిజంగానే మోదీ తమ ఖాతాల్లో 15 లక్షలు వేస్తాడేమో అనుకొని ఓట్లు గుద్దారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నల్లధనం సంగతి చూస్తామన్నారు. కానీ.. ఏమైంది.. నల్లధనం లేదు గిల్లధనం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఖాతాలో రూపాయి కూడా వేయలేదు. దాని గురించి జనాలు కూడా మరిచిపోయారు.
కానీ.. తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అత్వలే.. ఆ 15 లక్షల గురించి మాట్లాడాడు. ఆ డబ్బులు తప్పకుండా అందరి ఖాతాల్లోకి వస్తాయట. కాకపోతే కొంచెం టైమ్ పడుతుందట. మెల్లమెల్లగా వస్తాయట. ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదట ఇప్పుడు.. ఆర్బీఐ ఇవ్వట్లేదట. దీంతో ఒకేసారి అందరికీ ఇవ్వడం కుదరకపోవచ్చు.. అంటూ మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా ఇస్లాంపూర్‌లో జరిగిన ఓ మీడియాలో ఆయన వెల్లడించారు.
అయితే.. మంత్రి వ్యాఖ్యలను చాలామంది కొట్టిపారేస్తున్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెలికి తీసుకువచ్చాక అందరి అకౌంట్లలోకి మోదీ డబ్బులు వేస్తా అన్నారు కానీ… ప్రభుత్వం నుంచి ఇస్తా అనలేదంటూ ఆయనపై విరుచుకుపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి.. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఆయన ఇలా మాట్లాడి ఉంటాడని నిపుణులు చెబుతున్నారు.