అర్జెంట్‌గా వస్తుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నారా? ఆగండాగండి. ఇక నుంచి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తే మీరు 100 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఒక్క బహిరంగ మూత్ర విసర్జనకే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే 100 రూపాయలు, డ్రైనేజీల్లో చెత్త వేస్తే రూ.1000, రోడ్లపై చెత్త వేస్తే రూ. 2000, చెత్తకుండీల్లో కాకుండా చెత్త కుండీ పక్కన చెత్త వేస్తే రూ. 100, నాలాల్లో చెత్తను వేస్తే 10000 రూపాయలు, బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కు సంబంధించిన వ్యర్థాలను రోడ్ల మీద వేసినా.. బహిరంగ ప్రదేశాల్లో వేసినా రూ. 10000 జరిమానా విధిస్తారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం అమలులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ జరిమానాలను అమలు చేయనున్నారు. దాని కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యచరణ ప్రారంభించింది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్న ప్రాంతాలకు ఎంపిక చేసి అక్కడ సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నట్టు జీహెచ్‌ఎంసీ తెలిపింది.హైదరాబాద్‌లో ఎక్కువగా బహిరంగ మల, మూత్ర విసర్జన చేస్తున్న 28 ప్రాంతాలను గుర్తించామన్న అధికారులు.. ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.