జాబ్ ( Jobs ) ఉంటేనే సంపాదన. దాంతోనే జీవితం. ఒకటో తారీఖు వచ్చిందంటే జేబులో డబ్బులు పడకపోతే జీవితం ఎలారా బాబు అనిపిస్తుంటుంది. చేతిలో ఉన్న పెన్ను దగ్గర నుండి చెవికి పెట్టుకున్న కమ్మల వరకు అన్నింటికీ కావాల్సింది ‘డబ్బు‘. ఆ డబ్బు సంపాదించడానికి ఉద్యోగం ఉండాలి. కాకపోతే కొన్ని సార్లు మీరు చేస్తున్న ఉద్యోగం మానేయాలని అనిపిస్తుంది. అబ్బా ఏం జాబ్ రా బాబు.. రొటీన్ జీవితం చేసింది చాలు.. అని అని ఎప్పుడైనా అనిపించిందా..?? అసలు అలా అనిపించడానికి గల కారణాలు ఇవే
కుతూహలం లేకపోవడం
మీరు చేసే పని మీకు ఆనందాన్ని ఇవ్వాలి. లేదంటే పెళ్ళికి వచ్చి భోజనం చేసాం అన్నట్టుగా పనిచేసాం డబ్బులు వస్తున్నాయి అన్నట్టుగా మారుతుంది. మీరు చేసే పని మీకు కుతూహలాన్ని ఇవ్వకుండా ఎప్పుడు పూర్తవుతుందిరా దేవుడా అని మీకనిపించినపుడు మీరు జాబ్ చేయడానికి ఉత్సాహం చూపించట్లేదన్నమాట.
అనారోగ్యకరమైన పని వాతావరణం
పని చేస్తున్న స్థలంలో కొలీగ్స్ గానీ, బాస్ గానీ సరిగ్గా లేకుండా ఇబ్బందిపెడుతూ ఉంటే జాబ్ వదిలేయాలని అనిపిస్తుంది. దీనివల్ల వర్క్ మీద దృష్టి నిలపలేరు. తద్వారా పనిలో కొత్తదనాన్ని తెలుసుకోలేరు.
మీ నైపుణ్యాలకి తగినట్లుగా లేదని ఫీలవడం
రోజూ చేస్తున్న పనే చేస్తూ, కనీసం ఛాలెంజింగ్ లేకుండా ఉన్నప్పుడు బోర్ కొడుతుంది. అదే పనిని మళ్ళి మళ్ళీ చేయడం కొంతమందికి నచ్చుతుందేమో! కానీ జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళకి అది నచ్చదు. అందుకే జాబ్ మానేయాలని అనుకుంటారు.
విలువ లేకపోవడం
మీరెంత పని చేసినా దానికి విలువ లేకపోవడం. కనీసం కొలీగ్స్ కూడా పెద్దగా స్పందించకుండా ఈర్ష్య పడడం మొదలగునవి జాబ్ మానేయాలన్న ఆలోచనను కలగజేస్తాయి.
కల్చర్ లో ఇమడకపోవడం
ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిసార్లు మీ కంపెనీ కల్చర్ మీకు తగినట్లుగా ఉండకపోవచ్చు. అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చని సాంప్రదాయలు ఉన్న ఆఫీసుల్లో పనిచేయడం కంటే తెలివితక్కువ పని ఇంకోటి లేదు.