నొవాయ్ శిల్పాలన్నీ ఏకశిలా విగ్రహాలే. ఈ శిల్పాల కింద రాతి గద్దెలు ఉంటాయి. ఈ గద్దెలను అహు అని పిలుస్తారు. ఇక ఈ శిల్పాలను 1250 నుంచి 1500 సంవత్సరాల కిందట చెక్కినట్లు చరిత్ర చెబుతోంది.
కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పర్వతాలపై పరుచుకున్న పచ్చని గడ్డి. చూద్దామంటే చెట్లు మచ్చుకు ఒక్కటి కూడా కనపడవు. చిన్న చిన్న మొక్కలు, పొదలే అక్కడక్కడా ఉంటాయి. వాటి మధ్యలో ఎన్నో వందల సంవత్సరాల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన రాతి శిల్పాలు. మౌన ముద్రలో.. మమ్మల్ని పలకరించకండి.. అన్నట్లు చూస్తుంటాయి. ఈ అద్భుతమైన చారిత్రక సంపద చూపరులను కట్టి పడేస్తుంటుంది. అందుకే ఆ సంపదను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు ఏటా అక్కడికి వెళ్తుంటారు. అదే.. ఈస్టర్ ఐర్లాండ్ దీవి.. ఈ దీవిలో ఉన్న రాతి శిల్పాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ..!
చిలీ దేశానికి తూర్పు దిశగా సుమారుగా 3600 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే ఈస్టర్ ఐర్లాండ్ దీవి. ఈ దీవి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. దీని పొడవు 25 కిలోమీటర్లు. వెడల్పు 12 కిలోమీటర్లు. ఈ దీవిలో పురాతన కాలం నుంచి ఉన్న రాతి శిల్పాలు పర్యాటకులను ముక్కున వేలేసుకునేలా చేస్తుంటాయి. అంత అద్భుతంగా వాటిని చెక్కారు. ఒక్కో శిల్పం సుమారుగా 15 నుంచి 33 అడుగుల ఎత్తు ఉంటుంది. పొడవైన ముక్కు, పెద్ద చెవులతో ఈ శిల్పాలు చూసేందుకు భలే వింతగొల్పుతుంటాయి. ఈ శిల్పాలను నొవాయ్ అని పిలుస్తారు. అయితే ఈ దీవిలో ఇలాంటి శిల్పాలు 887 వరకు ఉన్నాయి.
నొవాయ్ శిల్పాలన్నీ ఏకశిలా విగ్రహాలే. ఈ శిల్పాల కింద రాతి గద్దెలు ఉంటాయి. ఈ గద్దెలను అహు అని పిలుస్తారు. ఇక ఈ శిల్పాలను 1250 నుంచి 1500 సంవత్సరాల కిందట చెక్కినట్లు చరిత్ర చెబుతోంది. కాగా వీటిని ఈ దీవిలో నివాసం ఉండే రెపనూయీ తెగ ప్రజలే చెక్కి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ శిల్పాలను ఎందుకు చెక్కారు ? వాటిని ఎక్కడ చెక్కారు ? ఇక్కడిదాకా ఎందుకు తీసుకువచ్చారు ? అన్న వివరాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
కాగా ఈ దీవిలో ఉన్న రానోరారాకుప్ క్వారీలో ఇంకా ఏకశిల విగ్రహాలు అలాంటివే కొన్ని ఉన్నాయట. అగ్ని పర్వతం పేలడం వల్ల బయటకు చిమ్మిన లావా నుంచి ఏర్పడ్డ శిలలతో ఈ శిల్పాలను చెక్కారట. ఆ తరువాత ఆ శిల్పాలను ఈ దీవిలోని అన్ని ప్రాంతాలకు తరలించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఈ దీవిలో పెద్ద చెట్లు ఒక్కటి కూడా కనిపించవు. అది కూడా ఒక వింతే. ఇక ఈ దీవిలో ప్రస్తుతం 6వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. వారిలో 60 శాతం మంది రెపనూయీ తెగకు చెందిన ప్రజలే కావడం విశేషం. ఇక ఈ దీవిలో ఉన్న శిల్పాలను చూసేందుకు ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు కూడా వస్తుంటారు. ఏది ఏమైనా.. ఈ దీవిలోని శిల్పాలు భలే వింతగా ఉన్నాయి కదా..!