ఈ ఏడాది కూడా టెక్కీలకు వర్క్‌ ఫ్రం హోమ్ తప్పదా

-

అన్ని రంగాలను ఓ ఆటాడేసింది కరోనా రక్కసి. రయ్య్‌మని దూసుకెళ్తున్న రంగాలను సైతం అథఃపాతాళానికి తొక్కేసింది. కానీ.. ఐటీ రంగంపై కరోనా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే.. ఐటీ కంపెనీలకు మేలుచేసింది కరోనా. వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఐటీ కంపెనీల ప్రొడక్షన్‌ ఎన్నడూ లేనంగా పెరిగింది. ఐటీ జాబ్‌ అంటేనే మెంటల్‌ టెన్షన్‌గా ఫీల్‌ అయ్యే టెక్కీలు సైతం ఆడుతూపాడుతూ రిలాక్స్‌డ్‌గా పనిచేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా టెక్కీలకు వర్క్‌ ఫ్రం హోమ్‌ బెటర్‌గా భావిస్తున్నాయి ఐటీ కంపెనీలు.

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నరంగాలు సైతం కరోనా కాటుకు కుదేలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలూడాయి. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. జిగేల్‌మన్న వ్యాపారాలు సైతం దివాళా తీశాయి. కానీ.. విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కుని లాభాల్లో నిలిచింది ఐటీ రంగం. గతంలో ఎన్నడూ లేనంత ప్రొడక్షన్‌ కూడా సాధించాయి ఐటీ కంపెనీలు. దీంతో… ఈ ఏడాది కూడా వర్క్‌ ఫ్రం హోమ్‌ బెటర్‌గా భావిస్తున్నాయి ఐటీ కంపెనీలు. ప్రొడక్షన్‌కు కూడా ధోకా లేకపోవడంతో… కంపెనీలు ఇదే బెటర్‌ అనుకుంటున్నాయి.

కరోనా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేలోపే అలర్ట్ అయ్యాయి ఐటీ కంపెనీలు. వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రకటించాయి. కంపెనీలకు తాళాలు వేశాయి. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లో ఓ ఉద్యోగికి కరోనా అనే కలకలం రేగడంతో ఎంఎన్‌సీలతోపాటు చిన్నతరహా ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రకటించాయి. ప్రపంచ ఐటీ సేవల రంగంలో మేటి దేశంగా భారత్‌ దూసుకుపోతున్న వేళ… కరోనా కలవరం కలిగించింది. రేపు ఎలా ఉంటుంది? కొత్త ప్రాజెక్టులు వస్తాయా? రావా? ఉద్యోగ భద్రత ఉంటుందా? లేదా? ఇలాంటి పీడకలలతో ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల్లో అలజడి రేగింది.

భారత ఐటీ రంగం టర్నోవర్‌ ఏటా 14 లక్షల కోట్ల రూపాయలు. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, బీపీఓ, ఐటీ ఆధారిత విభాగాల్లో 45 లక్షల మంది పని చేస్తున్నారు. ఇంత పెద్ద రంగం సంక్షోభాన్ని సైతం ధీటుగా ఎదుర్కుంది. భారత ఐటీ రంగం ప్రధానంగా అమెరికా, యూరప్‌ దేశాల మార్కెట్లపైనే ఆధారపడి ఉంది. కరోనా ప్రభావంతో… ఆయా దేశాల్లోని వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. దీంతో మన ఐటీ కంపెనీలకి అమెరికా, యూరప్‌ కస్టమర్ల నుంచి ముందుమాదిరిగా ప్రాజెక్టులు రాకపోవచ్చు అనుకున్నారు.. కానీ.. మిగతా దేశాలతో పోలిస్తే.. ఇండియాకే ఎక్కువ ప్రాజెక్టులు వచ్చాయి. ఇండియన్‌ టెక్కీస్‌ పనిసామర్థ్యం ఏంటో నిరూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news