కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా. కరోనామాత పేరుతో గుడికట్టి పూజిస్తే కరోనా అంతమైపోతుందని వారి నమ్మకం. ఇలా ఒక్కో దగ్గర ఒక్కో రకమైన నమ్మకాలు ఉంటాయి. తాజాగా ఇలాంటి నమ్మకమే జపాన్ లోనూ కనిపించింది. జపాన్ లో ఉన్న అతిపెద్ద బౌద్ధ దేవత విగ్రహానికి మాస్క్ కట్టిన వైనం అందరిలో ఆసక్తి కలిగించింది.

జపాన్ కార్మికులు కరోనా తొందరగా అంతమైపోవాలన్న ఉద్దేశ్యంతో ఇలాంటి పనికి పూనుకున్నారు. 33ఏళ్ళ క్రితం కట్టిన ఈ దేవత విగ్రహానికి చాలా ప్రాచుర్యం ఉంది. ఈ విగ్రహం భుజాల దాకా చేరుకోవడానికి గుండ్రంగా మెట్లు కూడా ఉన్నాయి. చేతిలో చిన్న పాప ఉన్న ఈ విగ్రహం వద్దకి చాలామంది దంపతులు వస్తుంటారు. తమకి పుట్టే పిల్లపాపలు క్షేమంగా ఉండాలని, సుఖ ప్రసవం జరగాలని ప్రార్థిస్తుంటారు. ఇప్పుడు ఆ బౌద్ధమాత విగ్రహానికి మాస్క్ పెట్టి కరోనా తొందరగా అంతం కావాలని కోరుకుంటున్నారు.

57మీటర్ల ఎత్తున్న విగ్రహానికి 4.3మీటర్ల పొడవుతో 5.3మీటర్ల ఎత్తులో మాస్క్ తయారు చేసారు. ఈ మేరకు కార్మికులంతా కలిసి పనిచేసారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మాట్లాడిన కార్మికులు జపాన్ లో కరోనా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు వచ్చేదాకా మాస్క్ ఉంటుందని అన్నారు. మొత్తానికి కరోనా తగ్గిపోవాలని ఒక్కో దగ్గర ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. ఎవరేం చేసినా కరోనా తొందరగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు తొందరగా వస్తే బాగుండని అందరూ కోరుకుంటున్నారు.