ఆ ఐస్‌క్రీమ్: సమ్మర్‌లో ఏదీ తినాలనిపించదు.. బాడీ అంతా చెమటలు.. వేడిగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా నిప్పుల కుంపటి పక్కనే ఉంటుంది. అందుకే చల్లగా ఉండేవి తినాలనుకుంటారు. అందుకే కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్‌కు ఈ సీజన్‌లో బాగా డిమాండ్ ఉంటుంది. వివిధ బ్రాండ్లు అనేక రకాల ఫ్లేవర్లతో వినూత్నమైన ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాయి. అయితే వీటి ధర మహా అయితే వందల్లో, మరీ స్పెషల్ అయితే వేలల్లో ఉండవచ్చు. కానీ జపాన్‌కు చెందిన పాపులర్ ఐస్‌క్రీమ్ బ్రాండ్ తయారు చేసిన ఒక లేటెస్ట్ డెసర్ట్ ధర ఏకంగా రూ.5లక్షలకు పైగానే ఉంది తెలుసా.. ఇది అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసిన కంపెనీగా జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ మేకర్ సెల్లాటో (Cellato) నిలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. ఈ బ్రాండ్ తయారు చేసిన బైకుయా (Byakuya) అనే డెజర్ట్ సర్వింగ్ ధర 873,400 జపనీస్ యెన్ ($6,696). మన కరెన్సీలో ఇది రూ.5.2 లక్షలు అవుతుంది.
ఎందుకు అంత కాస్ట్..
బైకుయా ఐస్‌క్రీమ్ ధర ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం, దాని తయారీలో వాడిన ప్రత్యేక పదార్థాలు. ఐస్‌క్రీమ్ కోసం ఇటలీలోని ఆల్బాలో పండించిన అరుదైన వైట్ ట్రఫుల్ వినియోగించారు. దీని ధర కిలోకు 2 మిలియన్ జపనీస్ యెన్ (సుమారు రూ.11.9 లక్షలు) ఉంటుంది. ఎడిబుల్ గోల్డ్, పార్మిజియానో రెగ్జియానో, సేక్ లీస్ వంటి ఇతర ప్రత్యేక పదార్థాలను దీని తయారీకి వాడారు.
టేస్టింగ్ సెషన్‌లో పాల్గొన్న సెల్లాటో సిబ్బంది మాట్లాడుతూ.. బైకుయా రుచి, టెక్చర్ అద్భుతంగా ఉందట… వైట్ ట్రఫుల్ ఫ్రాగ్రెన్స్, పర్మిజియానో రెజియానో గట్టితనం, పండ్ల రుచి, సేక్ లీస్ రాయల్ టేస్ట్.. ఈ డెసర్ట్‌ను ప్రత్యేక పదార్థంగా మార్చాయని ఆయన వివరించారు. దీన్ని డెవలప్ చేయడానికి 1.5 సంవత్సరాలు పట్టిందని సెల్లాటో సిబ్బంది పేర్కొన్నారు. ఎన్నో ట్రయల్స్, ఎర్రర్స్‌తో అద్భుతమైన రుచిని అందించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సాధించడం.. తమ ప్రయత్నానికి తగిన విలువను అందించిందని సెల్లాటో ప్రతినిధి చెప్పారు.
ఈ ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి సెల్లాటో కంపెనీ యూరోపియన్, జపనీస్ పదార్థాలను వినియోగించింది. ఇమాజినేటివ్ ఫ్యూజన్ వంటకాలకు ప్రసిద్ధి చెందిన చెఫ్ తడయోషి యమడ సాయంతో బైకుయా డెసర్ట్‌ను కంపెనీ తయారు చేయించింది.