పోలీస్‌ అకాడమీలో చోరీ.. ఏడు కంప్యూటర్లు మాయం.. ట్విస్ట్‌ ఏంటంటే..

-

సంక్రాంతి అంటే.. నగరాల్లో ఉన్నవారంతా.. ఊర్ల బాటపడతారు.. పాపం పోలీసులకు ఈ నాలుగు రోజులు చుక్కలే.. దొంగతనాలు జరగకుండా చూసుకోవాలి.. అటు కోడిపందాలు, పేకాటలు నిర్వహించకుండా చూసుకోవాలి.. ఈ హడావిడీలో పోలీసులు ఉంటారు.. మనం అక్కడా ఇక్కడా ఎందుకు ఏకంగా పోలీస్‌ అకాడమీలోనే కన్నం వేద్దాం అనుకున్నారేమో ఆ దొంగలు.. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్ అకాడమీలో చోరీ చేసి ఏడు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు..! ట్విస్ట్‌ ఏంటంటే..
హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న దొంగతనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈసారి సామాన్యుల ఇళ్లలో కాకుండా.. ఏకంగా పోలీస్ అకాడమీలోనే దొంగతనం జరిగింది. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. దొంగలు అకాడమీలోకి ప్రవేశించి కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అకాడమీలో ఉన్న కంప్యూటర్లు మాయం చేశారు. భద్రతా బలగాల కళ్లు గప్పి ఏకంగా 7 కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు..ఇంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నుంచి చాకచక్యంగా కంప్యూటర్లు దొంగలించింది ఎవరో కాదు ఇంటి దొంగే.. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు.. నిజంగా అలా పట్టుకోలేరేమో అనుకోని.. అక్కడ పనిచేసే ఉద్యోగే దొంగతనం చేశాడు..
కంప్యూటర్లు మాయం అయిన విషయాన్ని గమనించిన అధికారులు.. వెంటనే అక్కడ ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ పరిశీలించారు. ఫూటేజ్‌లో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు చక్కగా రికార్డ్‌ అయ్యాయి.. అసలు దొంగ దొరికేశాడు. అకాడమీలోని ఐటీ సెక్షన్‌లో పని చేస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఎన్‌పీఏ అధికారులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సామాన్యుల ఇళ్లలోనే ఇంటిదొంగలు ఉంటారనుకుంటే.. ఈసారి ఏకంగా ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీలోనే దొంగతనం జరగటం గమనార్హం.. అసలే పండుగ సెలవులు.. ఆపై అందరూ ఊళ్లు వెళ్లటం… ఈ నేపథ్యంలో ఇలా ఒకటి తర్వాత ఒకటి చోరీల ఘటనలు వెలుగు చూస్తుండటంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news