ఆ చెట్టు కింద నిలబడితే చనిపోతారు.. ఆ పాలు మీద పడితే ప్రాణాంతకమే 

-

చెట్లు అంటే మనల్ని రక్షించేవి. చెట్లతోనే మనిషి జీవనం ఆధారడి ఉంటుంది కదా. చెట్ల వల్ల మనకు ఉపయోగమే కానీ, హాని ఏమీ లేదని మనకు తెలుసు. కానీ ఈ ప్రపంచంలో మనిషి ప్రాణం తీయగల చెట్లు కూడా ఉన్నాయని మీకు తెలుసా. ఈ విషపూరితమైన చెట్లనుంచి విషపు పాలు వస్తాయి. ఇలాంటి చెట్లు వైపు వెళ్లినా, ముట్టుకున్నా ప్రాణాలకు ప్రమాదమేనట. అసలు ఈ చెట్లు ఏంటో, ఇవి ఎందుకు ఇంత ప్రమాదకరం అయినాయో చూద్దాం.
ఈ చెట్టు పేరు ‘మంచినీల్ చెట్టు’ ఇదో పూల జాతికి చెందిన చెట్టు. విషపూరితమైనది. ఈ చెట్లు దక్షిణ-ఉత్తర అమెరికా నుంచి ఉత్తర-దక్షిణ అమెరికా వరకూ ఉన్నాయట. చెట్టు పేరు చూసి… ఇదేదో మంచినీళ్ల చెట్టు చెట్టు నుంచి నీళ్లు వస్తాయనుకునేరు..అలా కాదు. ఈ పేరు స్పానిష్ పదమైన మంజనీల్ల నుంచి వచ్చింది. అంటే చిన్న యాపిల్ అని అర్థం. ఈ చెట్టుకు కాసే చిన్న పండ్లు యాపిల్‌లా కనిపిస్తాయట. చెట్టు ఆకులు కూడా యాపిల్ చెట్టును పోలి ఉంటాయి. అందుకే దీన్ని బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్లలో ఇదీ ఒకటి. ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం వస్తుంది. దానిలో రకరకాల విషాలు ఉంటాయి. ఆ పాలను టచ్ చేస్తే చాలు… దద్దుర్లు, కురుపుల వంటివి వచ్చేస్తాయట. చెట్టు ఆకులు, బెరడు, పండ్లు… అంతటా ఈ విషపు పాలు వస్తాయి. అందువల్ల ఈ చెట్టును ముట్టుకున్నా, దీని దగ్గరకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదమే అంటున్నారు నిపుణలు.

ఈ చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి:

కరీబియన్ దీవులకు చెందిన ఈ చెట్లు ప్రస్తుతం ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికో, మధ్య అమెరికా, ఉత్తర-దక్షిణ అమెరికాలో కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు సముద్ర తీరాల పక్కన కూడా ఉంటున్నాయి. మాంగ్రూవ్ చెట్ల మధ్యలో ఇవి కూడా పెరుగుతాయి. ఇవి గాలుల తీవ్రతను తగ్గించగలవు, నేల కోత పడకుండా ఉంచగలవు. సముద్రం వల్ల నేలపై మట్టి సముద్రంలో కలిసిపోకుండా వీటి వేర్లు నేలను బలంగా ఉంచగలుగుతాయి.. 49 అడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే ఈ చెట్లు… ఎరుపు-బూడిదరంగు బెరడుతో ఉంటుంది.. గ్రీన్-పసుపు పూలు పూస్తాయి. మెరిసే ఆకులు గ్రీన్ కలర్‌లో ఉంటాయి. ఈ చెట్టు పండు తిన్నా చాలు చనిపోవడం ఖాయం. చెట్టులో ఏ భాగం తిన్నా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఓర్ని ఇంత విషపూరితంగా ఉంది ఈ చెట్టు.

అంతా విషపూరితమే:

ఈ చెట్టు కిందకు వెళ్లిన వారు కాసేపు అక్కడ ఉంటే చాలు… మెల్లగా ఎలర్జీలు రావడం మొదలవుతాయి. చర్మంపై దురదలు వస్తాయి. పొరపాటున చెట్టు పాలు మీద పడితే ఇక అంతే. తట్టు తేలుతుంది. దద్దుర్లు వస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కింద అస్సలు నిలబడకూడదు. చెట్టు పాలు… వర్షపు నీటి చుక్కతో కలిసి… మన చర్మంపై పడినా చాలు చర్మం కాలిపోయినట్లు అయిపోతుందట. కందిపోతుంది, బుడగలలాగా ఉబ్బుతుంది, రక్తం కారుతుంది, నొప్పి భరించలేం.
మనుషులే కాదు ఈ చెట్టు కింద ఏ కారో, బైకో పార్క్ చేసి.. తర్వాత వచ్చి చూస్తే… అవి కూడా పాడైపోతాయి. వాటిపై ఉన్న పెయింట్ దెబ్బతింటుంది. ఇంత ప్రమాదకరంగా ఉన్నాయని వీటిని తగలబెడదామంటే.. ఈ చెట్టును తగలబెడితే… దీని నుంచి వచ్చే పొగ కళ్లను తాకితే… కంటికి గాయాలు తప్పవు. చెట్టు పాలు కళ్లలో పడితే చూపు పోయే ప్రమాదం ఉందట.

చెట్ల దగ్గర ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదు:

ఇంత విషపూరితమైన చెట్టుకదా..ఈ పాటికి ఎంతోమందిని బలితీసుకుంది అనుకుంటున్నారేమో.. అదృష్టం కొద్దీ ఈ చెట్ల దగ్గర ఇప్పటివరకూ ఎవరూ చనిపోలేదు. ప్రభుత్వాలు అన్ని చర్యలూ తీసుకుంటున్నాయి. ఈ చెట్టు పండ్లు తియ్యగా ఉంటాయి. అలా అని తిన్నారంటే.. కాసేపటి తర్వాత… నోట్లో మంట మొదలవుతుంది, తర్వాత చర్మం చీరుకుపోతున్నట్లు అనిపిస్తుంది, గొంతుపట్టేసినట్లు అయిపోతుంది. అంతకంతకూ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అందుకే పూర్వం గిరిజనులు ఈ చెట్ల పాలను బాణాల చివర అటించి వన్యమృగాలను వేటాడేవారు. బాణం టచ్ చెయ్యగానే… వన్యప్రాణులకు ఆ పాలు తగిలి విలవిలలాడేవి. అలా… ఆటవికులు ఆహారం సంపాదించుకునేవారు. జంతువులు, పక్షులకు కూడా ఈ చెట్లు ప్రమాదకరమే.
 ఇవి ప్రమాదకర చెట్లు అయినప్పటికీ కరీబియాలో ఫర్నిచర్ తయారీ కంపెనీలు… శతాబ్దాలుగా ఈ చెట్లతో ఫర్నిచర్ తయారుచేస్తున్నాయి. చెట్ల కొమ్మలను కట్ చేసి.. ఎండబెట్టి… పూర్తిగా విషపు పాలు ఆవిరయ్యేలా చేస్తున్నారు. ఆ తర్వాతే వాటితో ఫర్నిచర్ చేస్తున్నారట. ప్రస్తుతం ఫ్లోరిడాలో ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాతుల్లో చేరాయి. వీటిని కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట.
ఇవి అనే కాదు..కొన్ని చెట్లు డేంజర్ గానే ఉంటాయి. అందులో ఇది ఒకటి.. తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు ముందు వెనుక చూడకుండా ఏ చెట్లు కింద పడితే ఆ చెట్లు కింద సేద తీరాలని అనుకోకండి. మనకు తెలియదు కదా..అవి ఎలాంటి రకమైన వృక్షాలో.

Read more RELATED
Recommended to you

Latest news