ఆ గ్రామంలో పెళ్లికాని అమ్మాయి ఫోన్ వాడితే తండ్రికి లక్షన్నర జరిమానా !

-

స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రికీ భార‌త రాజ్యాంగం స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు క‌ల్పించింది. దాని ప్ర‌కారం ఎవ‌రికైనా స్వేచ్ఛ‌గా జీవించే హ‌క్కు ఉంటుంది. ఎవ‌రు ఎవ‌రిపై ఎలాంటి అధికారాలు, నియంత్ర‌ణ‌లు విధించ‌డానికి అవ‌కాశం లేదు. ఎవ‌రు ఎలాగైనా జీవించవ‌చ్చు. ఫ‌లానా ప‌ని చేయి, అది చెయ్యొద్దు, ఇది చేయాలి.. అని ఒక‌రు ఇత‌రుల‌పై జులుం చెలాయించ‌కూడ‌దు. అలా చేస్తే రాజ్యాంగ‌ హ‌క్కుల‌కు భంగం క‌లిగించిన‌ట్లే అవుతుంది. గుజ‌రాత్‌లోని ఒక గ్రామంలోని పెద్ద‌లు కూడా స‌రిగ్గా ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తూ యువ‌తుల‌కు క‌ట్టుబాట్ల‌ను విధించారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

Village In Gujarat Bans Mobiles For Single Women

గుజ‌రాత్‌లోని బాణస్కాంత గ్రామంలో గ్రామ పెద్ద‌లు త‌ల‌తిక్క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న యువ‌తులెవ‌రూ మొబైల్ ఫోన్ల‌ను వాడ‌కూడ‌ద‌ని క‌ట్టుబాటు విధించారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఆ నియ‌మాన్ని అతిక్ర‌మించి ఫోను వాడుతూ క‌నిపిస్తే అలాంటి యువ‌తుల తండ్రుల‌కు ఏకంగా లక్షన్న‌ర రూపాయ‌ల జ‌రిమానా విధిస్తార‌ట‌. అలాగే ఆ గ్రామంలో ఉన్న యువ‌తులు త‌మ త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా పెళ్లిళ్లు చేసుకుంటే అది కూడా నేర‌మే అవుతుంద‌ని ఆ పెద్ద‌లు నిర్ణ‌యించారు. దీంతో ఆ గ్రామ పెద్ద‌ల నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

పిల్ల‌లు త‌మ త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా ఎవ‌రో ఒక‌ర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతార‌నే భ‌యంతో పాటు, ఫోన్ల‌ను వాడ‌డం వ‌ల్ల సోష‌ల్‌మీడియాలో వేరే వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డి.. అది కాస్తా ప్రేమ‌కు దారి తీసి… ఆ త‌రువాత‌ ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువ‌గా జ‌రుగుతాయ‌నే ఆందోళ‌నతోనే ఆ పెద్ద‌లు ఇలాంటి దిక్కుమాలిన నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని సామాజిక వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నేటి ఆధునిక యుగంలో టెక్నాల‌జీ ప్ర‌పంచంలో యువ‌త ఒక‌రితో ఒక‌రు పోటీప‌డ‌మ‌ని చెప్పాల్సిందిపోయి, మొబైల్ ఫోన్ల వాడ‌కం ప‌ట్ల నిషేధం విధించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఈ చ‌ర్య క‌చ్చితంగా లింగ‌వివ‌క్ష‌ను ప్రేరేపిస్తుంద‌ని, స‌మాజాన్ని మ‌రో యాభై, అర‌వై ఏళ్లు వెన‌క్కి తీసుకుపోతుంద‌ని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు ఉన్నంత కాలం స‌మాజం స్థితి ఇలాగే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పూ రాదు.. ఒక వేళ వ‌స్తుంద‌ని మ‌నం ఆశించినా.. అది అడియాశే అవుతుంది త‌ప్ప‌.. అది ఎప్ప‌టికీ నెర‌వేర‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news