ఎప్పటికైనా సొంత ఇంట్లో నివాసం ఉండాలని చాలా మంది కలలు కంటుంటారు. అందుకనే తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రస్తుత తరుణంలో ఇల్లు కొనాలన్నా లేదా స్థలం కొని ఇల్లు కట్టించుకోవాలన్నా.. రూ.లక్షలు మొదలుకొని రూ.కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలోనే ఎవరి స్థోమతకు తగినట్లువారు ఇళ్లను కొనడమో, కట్టించుకోవడమో చేస్తుంటారు. అయితే ఇళ్లను కొనే విషయానికి వస్తే అక్కడ మీకు కేవలం రూ.88కే ఇల్లు దొరుకుతుంది. అవును.. మీరు విన్నది నిజమే.
ఇటలీలోని మోలిసె ప్రాంతంలో కాస్ట్రోపిగ్నానో అనే టౌన్ ఉంది. అక్కడ మొత్తం 923 జనాభా ఉంటుంది. ఒక బార్, ఒక రెస్టారెంట్ ఆ టౌన్‌లో ఉన్నాయి. అక్కడ 14వ శతాబ్దానికి చెందిన ఓ కోట కూడా ఉంది. అందులో కొందరు నివసిస్తుంటారు. అయితే ఆ టౌన్‌లోని జనాలు అక్కడ నివాసం ఉండడం నెమ్మదిగా మానేస్తున్నారు. దీంతో అక్కడ ఖాళీగా ఉండే ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఆ టౌన్‌కు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. దీంతో ఆ టౌన్‌లో ఎలాగైనా జనాలను నింపాలనే ఉద్దేశంతో ఇటలీ ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్కడ ఖాళీగా ఉన్న ఒక్కో ఇల్లును కేవలం రూ.88.87 కే అమ్ముతోంది. దీంతో జనాలు మళ్లీ ఆ టౌన్‌కు వచ్చి అక్కడ స్థిర పడుతారని ఆలోచన.
అయితే అంత మొత్తం పెట్టి కొనుగోలు చేసినా ఇళ్లను రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేదా పూర్తిగా కూల్చి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. ఇంట్లోనే ఏదైనా షాప్, రెస్టారెంట్ వంటివి పెట్టుకోవచ్చు. ఆ ప్రాంతాన్ని టూరిస్టు ప్రదేశంగా మార్చాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ఈ ఆఫర్‌ను పెట్టారు. సహజంగానే కొండలపై ఆ టౌన్ ఉంటుంది. సమీపంలో సముద్రం ఉంటుంది. కనుక ప్రకృతి అందాలకు ఆ ప్రాంతం నెలవుగా ఉంది. కానీ అక్కడి నుంచి జనాలు వెళ్లిపోతుండడం పాలకులను కలవరపెడుతోంది. అందుకనే అలా తక్కువ ధరకే ఇళ్లను అమ్ముతున్నారు.