ఆ హోటల్‌లో ఫ్రీగా ఉండొచ్చు.. కానీ ఆ ఒక్క కండీషన్‌కు ఒప్పుకుంటేనే..!

-

యావ్రేజ్‌ హోటల్స్‌లో ఒక్కరోజు ఉంటేనే కనీసం వెయ్యి రూపాయలైనా ఖర్చుపెట్టాల్సిందే.. అలాంటిది ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ హోటల్‌లో అడుగుపెడితే ఇంద్రభవనంలా ఉంటుంది. ఏసీ, ఆ సర్వీసులు, ఫుడ్‌ అబ్బో అదొక మాయా ప్రపంచం. పైసలున్నవాళ్ల వాళ్లే ఐతుంది..మనవల్ల కాదులే అనుకుంటాం.. కానీ ఈ హోటల్‌లో ఫ్రీగా ఉండొచ్చు. అలా అని ఏ తుప్పాస్‌ హోటల్‌ అనుకుంటారేమో.. నెంబర్‌ వన్‌ అండీ..ఏసీ గదులు, మెత్తటి పరుపులు, కళ్లు జిగేల్‌ మనే ఫర్నీచర్‌, కోరిన ఆహారం. ఒక రకంగా చెప్పాలంటే ప్యాలెస్‌ అనే చెప్పాలి. కానీ ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారనేగా మీ డౌట్‌.. ఈ కండీషన్‌కు ఒప్పుకుంటేనే ఫ్రీగా ఇస్తారట.. ఇంతకీ ఆ షరతు ఏంటంటే..

ఆ హోటల్‌లో వాళ్లు ఫ్రీగా ఇచ్చే గది గోడలు పారదర్శకమైన గాజుతో చేసినవి. మీరు లోపల చేసే ప్రతి పని బయటికి కనిపిస్తుంది. అందులోనూ ఈ గదిని హోటల్ లోకి అడుగుపెట్టగానే ఎంట్రన్స్ లోనే కట్టారు. పక్కన రిసెప్షన్ కూడా ఉంటుంది. వచ్చి పోయే వారందరికీ గదిలోపల ఉన్నవారు కనిపిస్తారు. ఈ షరతు వల్ల మీకు ఇబ్బంది లేకపోతే ఆ గదిని నచ్చినట్టు వాడుకోవచ్చు. అంత ఉచిత దర్శనం అయితే ఇక రూం తీసుకుని ఏం చేయాలి పిండి పిసుక్కోవాలా అని కోపం వస్తుంది కదా..!

ఇంతకీ ఈ హోటల్‌ ఎక్కడుందంటే..

స్పెయిన్‌‌లోని ఇబిజా అనే దీవిలో ఉంది ఈ హోటల్. పేరు పారడైజ్ ఆర్ట్ హోటల్. ఆ ప్రత్యేక గది పేరు ‘జీరో సూట్’. ఈ గదిలో ఎవరు ఉంటారో వారే ఆ హోటల్‌‌కి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోతారు. ఈ గదిలో ఉచితంగా ఒక్క రాత్రి మాత్రమే ఉండవచ్చు. డీజే, సినిమాలు, రేడియో కార్యక్రమాలు ఇలా చాలా కళాత్మక ప్రదర్శనలు ఆ గదిలో ఉన్నవారి కోసం ఏర్పాటు చేస్తారు.

అన్నీ బయటకు కనిపిస్తాయి అంటున్నారు ఒకవేళ బాత్రుమ్‌కు వెళ్లాలంటే..అది ఎలా అని మీరు అడగొచ్చు.. ఆ విషయంలో మాత్రం మనోళ్లు కాస్త బుర్రవాడారులేండి..వాటికి మాత్రం అపారదర్శకమైన గోడలను పెట్టారు. ఈ గదిలో ఓ రాత్రి బస చేసిన వారు తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఆ గదిలో నిద్రపోవడం ఓ పీడకల అని కామెంట్ చేశారు. మరొక వ్యక్తి ‘ఆ గదిలో నిద్రపోతే దుస్తుల్లేకుండా పబ్లిక్‌లో నిద్రపోయిన ఫీలింగ్ వచ్చింది’ అని అన్నారు. మొత్తానికి హోటల్‌ పబ్లిసిటీ కోసం ఇలా ప్రైవసీని పబ్లిక్‌ చేసింది హోటల్‌ యాజమాన్యం.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news