ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖర్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డా ప్రకటించారు. శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం జేపీ నడ్డా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.. జగదీప్ ధన్ఖర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్‌లోని కిథానా అనే కుగ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్.. యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1989లో ఝుంఝును నుంచి జనతాదళ్ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ పని చేసిన జగదీప్.. సుప్రీం కోర్టు న్యాయవాదిగా, రాజస్థాన్ హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సేవలందించారు.
2019 జూలై 30న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన్ను బెంగాల్ గవర్నర్‌గా నియమించారు. వాస్తవానికి ఎన్డీయే ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవడం.. ఆయన్ను రాజ్యసభకు రెన్యువల్ చేయక పోవడంతో.. నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజస్థాన్‌కు చెందిన జగదీప్ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.